నేటి నుండే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర.. ఈసారి టార్గెట్?
కొన్ని షరుతలతో విశాఖలో యాత్రకు అనుమతులు జారీ చేశారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వారాహి యాత్ర నేడు మొదలు కానుంది. విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్రను పవన్‌కళ్యాణ్ నేడు మొదలుపెట్టనున్నారు. ఆగష్టు 19 వరకు జనసేన మూడో విడత వారాహి యాత్ర కొనసాగించనున్నారు. ఉత్తరాంధ్రలో 10 రోజులపాటు పర్యటించనున్న పవన్.. విశాఖలోని పలు ప్రాంతాలను సందర్శించనున్నారు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపనున్నారు. వారాహి యాత్రలో భాగంగా జగదాంబ జంక్షన్‌లో ఏర్పాటు చేసే సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. అనంతరం జనవాణి కార్యక్రమం, క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు. ఇక యాత్రను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. పవన్ వారాహి యాత్రకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు పోలీసులు.
కొన్ని షరుతలతో విశాఖలో యాత్రకు అనుమతులు జారీ చేశారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని, ఎయిర్‌పోర్ట్ నుంచి ర్యాలీగా రావొద్దని సూచించారు. ఇక వాహనం పైనుంచి అభిమానులకు అభివాదాలు చేయవద్దని షరతు పెట్టారు. జగదాంబ జంక్షన్‌లో బహిరంగ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేసినా.. భవనాలపైకి కార్యకర్తలు, అభిమానులు ఎక్కకుండా చూసే బాధ్యత జనసేనదేనని, ఉల్లంఘనలు జరిగితే అనుమతి తీసుకున్నవారిదే బాధ్యత అని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల షరతులపై జనసేన పార్టీ ట్విట్టర్‌లో స్పందించింది. ర్యాలీలో లేదా సభా వేదిక వద్ద క్రేన్లతో గజమాలలు వేయడం లాంటివి చేయవద్దని, భద్రతకు సహకరించాలని కోరింది. వారాహి యాత్ర మార్గంలో క్రేన్లు, వాహనాలు ఏర్పాటు చేయడం వల్ల వాహన శ్రేణి సాఫీగా సాగడం లేదని జనసేన పార్టీ ప్రకటనలో తెలిపింది. పవన్ కళ్యాణ్ భద్రతకు భంగం వాటిల్లకుండా వారాహి విజయ యాత్రకు విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. భద్రతా కారణాలను పార్టీ శ్రేణులు, అభిమానులు దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది.