పవన్ కళ్యాణ్ విజయవాడ పర్యటన రద్దు

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ విజయవాడ పర్యటన రద్దయింది

Update: 2023-09-09 12:47 GMT

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ విజయవాడ పర్యటన రద్దయింది. శాంతిభద్రతల సమస్య ఉందని పోలీసులు మెయిల్‌ పంపడంతో పర్యటన రద్దైందని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. దీంతో పవన్‌ కళ్యాణ్ కాన్వాయ్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి వెనుదిరిగింది.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చేందుకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ విమానానికి బేగంపేట విమానాశ్రయ అధికారులు అనుమతి ఇవ్వలేదని సమాచారం. విమానాశ్రయ అధికారుల అనుమతి కోసం పవన్‌ వేచి చూశారు. విమానానికి ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో పవన్ కళ్యాణ్ విజయవాడ పర్యటన రద్దు అయింది. గన్నవరం విమానాశ్రయం వద్ద జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను విమానాశ్రయంలోకి వెళ్లేందుకు నిరాకరించారు.

అంతకుముందు  టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ప్రాథమిక ఆధారాలు చూపకుండా చంద్రబాబు నాయుడిని అర్థరాత్రి అరెస్టు చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. 2022 అక్టోబర్‌లో వైజాగ్ లో తమ పట్ల కూడా అలాగే ప్రవర్తించారనీ, ఏ తప్పూ చెయ్యని తమ కార్యకర్తల్ని అరెస్టు చేశారని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది అన్నారు. లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చెయ్యాల్సింది పోలీసులైతే.. వైసీపీ వాళ్లు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారని పవన్ ప్రశ్నించారు. వైసీపీ నేతలైతే విదేశాలకు కూడా వెళ్లవచ్చనీ, అదే టీడీపీ నేతను అరెస్టు చేస్తే, కనీసం ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఇళ్ల నుంచి బయటకు రాకూడదా అని పవన్ ప్రశ్నించారు. చంద్రబాబుకి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని పవన్ తెలిపారు. దీని నుంచి చంద్రబాబు త్వరగా బయటపడాలని కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారు.


Tags:    

Similar News