నో టెన్షన్.. గ్లాస్ గుర్తు జనసేనదే
జనసేన పార్టీ నాయకులను ఇన్నాళ్లూ టెన్షన్ పెడుతూ వచ్చిన గుర్తు సమస్య ఎట్టకేలకు
జనసేన పార్టీ నాయకులను ఇన్నాళ్లూ టెన్షన్ పెడుతూ వచ్చిన గుర్తు సమస్య ఎట్టకేలకు తీరిపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జనసేనకు గుడ్ న్యూస్ చెప్పింది. గాజు గ్లాసు గుర్తును మరోసారి జనసేనకే కేటాయిస్తూ ఆదేశాలను ఇచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ కు కృతజ్ఞతలు చెబుతూ జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
"జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్ ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్ధులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేసిన సంగతి విదితమే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 137 స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్ సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు నాడు పోటీలో నిలిచారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ప్రజలకు సేవ చేయడానికి జనసేన అభ్యర్థులు సన్నద్ధమైన తరుణంలో రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు, యావన్మంది సిబ్బందికి పేరుపేరునా నా తరపున, జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను." అంటూ జనసేనాని ఓ ప్రకటనను విడుదల చేశారు.
తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేశారు. అయితే, ఫలితాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో జనసేన పార్టీ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. అయితే జనసేనకు మళ్లీ గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది.