భూసేకరణలో పెద్దయెత్తున అవినీతి : నాదెండ్ల
వైసీపీ ప్రభుత్వంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మరోసారి ఫైర్ అయ్యారు
వైసీపీ ప్రభుత్వంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మరోసారి ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం రోజుకో అవినీతిలో కూరుకుపోతుందన్నారు. జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో ఈ ప్రభుత్వం పేదలను వంచిస్తోందని అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగనన్న కాలనీలకు భూ సేకరణ పేరిటి పెద్దయెత్తున అవినీతి జరిగిందన్నారు. గత ఏడాది నవంబర్ నెలలో గుంకలామ్ లోని జగనన్న కాలనీని పవన్ కల్యాణ్‌ను దర్శించారని, కానీ ఈ కాలనీల నిర్మాణం ద్వారా లబ్ది పొందింది వైసీపీ ప్రజా ప్రతినిధులే తప్ప ప్రజలు కాదని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
విచారణకు డిమాండ్...
భూసేకరణ పేరుతో 35,141 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కాలనీల ద్వారా లబ్ది పొందింది జగన్, వైసీపీ ప్రజాప్రతినిధులు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ శానసనసభలో చెప్పిన లెక్కలకు, వాస్తవ పరిస్థితికి పొంతన లేదన్న నాదెండ్ల గుంటూరు జిల్లాలో జగనన్న కాలనీలో పెద్దయెత్తున అవినీతి జరిగిందన్నారు. ఈ కుంభకోణంలో అవినీతికి పాల్పడిన ఎవరినీ వదిలి పెట్టబోమని నాదెండ్ల హెచ్చరించారు. బురదల్లో, కొండల్లో ఊరి చివర శ్మశానాల వద్ద భూములు ఇచ్చి, అక్కడ కాలనీలను నిర్మిస్తామంటే ప్రజలు ఆందోళన చెందారన్నారు. అందుకే చాలా మంది లబ్దిదారులు తమకు ఇళ్ల స్థలాలు వద్దని తెలిపారని అన్నారు. భూసేకరణపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.