పవన్ కల్యాణ్ సారీ చెప్పాలంటూ కాలర్ ట్యూన్ : జనసేన ట్వీట్
అలాగే రాష్ట్రం వాలంటీర్లను ఉద్దేశిస్తూ.. మీరు కలెక్ట్ చేసిన డేటా దేనికి వాడుతున్నారో వాలంటీర్లు గ్రహించాలని సూచించింది.
రాష్ట్రప్రజలకు సంబంధించిన వ్యక్తిగత డేటా లీకేజీపై జనసేన ట్వీట్ చేసింది. జనసేన శతాఘ్ని ట్విట్టర్ హ్యాండిల్ నుంచి చేసిన ఈ ట్వీట్ లో.. రాష్ట్ర ప్రజల ఫోన్ నంబర్ల డేటా భద్రంగానే ఉందా ? అంటూ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. "మీ డేటా భద్రమేనా ? రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి ఫోన్ నెంబర్ల డేటా IVR సర్వీస్ ఏజెన్సీ కి ఎలా వెళ్ళింది ? మీ అనుమతి లేకుండా మీ నెంబర్స్ థర్డ్ పార్టీ వారికి ఎలా చేరాయి ? వాలంటీర్స్ కు క్షమాపణ చెప్పాలని అడుక్కుంటుంది ఎవరు ? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డేటా బ్రీచ్ నిజమా కాదా ? ఈ రోజు IVR కాల్స్, రేపు మరొకటి, అసలు ప్రజల నెంబర్లను సేకరించేది ప్రభుత్వ పథకాల అమలు కోసమా ? లేక ప్రచారం కోసమా ?" అని ప్రశ్నించింది.
అలాగే రాష్ట్రం వాలంటీర్లను ఉద్దేశిస్తూ.. మీరు కలెక్ట్ చేసిన డేటా దేనికి వాడుతున్నారో వాలంటీర్లు గ్రహించాలని సూచించింది. రాష్ట్ర ప్రజల వ్యక్తిగత డేటా థర్డ్ పార్టీకి లీకవుతున్న విషయాన్ని పోలీస్ అధికారులు సుమోటాగా తీసుకుని విచారణ చేపట్టాలని జనసేన శతాఘ్ని టీమ్ కోరింది. ఈ ట్వీట్ కు జత చేసిన వీడియోలో.. ఒక ఫోన్ కాల్ రికార్డ్ ను యాడ్ చేసింది. అందులో ఫోన్ కాల్ రింగ్ కు బదులు.. పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ.. సారీ చెప్పే వరకూ పోరాడదాం అంటూ చెప్పే ఒక కాలర్ ట్యూన్ వినిపిస్తుంది. ఈ ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఎంత చేతకాని దద్దమ్మలు కాకపోతే..ఫోన్ రింగ్ అవడం, ట్యూన్ సాంగ్ రావడమూ తీసేసి పవన్ sorry చెప్పాలంట..అది ఫిక్స్ చేశారు ycp పెట్టిన వాలంటీర్ వైసీపీ govt కార్యకర్తలే అని ycp ఎమ్మెల్యే లు అంటారు..salary govt హే ఇస్తుంది,మరి govt pk చేసినా విమర్శలు తప్పయితే action తీసుకోవట్లేదు ఎందుకు" అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు "ఆ ఫోన్ నంబర్ హైద్రాబాద్ కోడ్‌లా వుందేంటీ.? హైద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా.?" అని ప్రశ్నించారు.
కాగా.. రాష్ట్రంలో కొందరు వాలంటీర్లు ప్రజల వ్యక్తిగత డేటాను థర్డ్ పార్టీకి చేరవేస్తూ.. హ్యూమన్ ట్రాఫికింగ్ కు సహకరిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏలూరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి, వెంటనే తమకు క్షమాపణలు చెప్పాలని ఆందోళనలు చేశారు. అధికార పార్టీ మంత్రులు సైతం పవన్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. విజయవాడ కృష్ణలంక పీఎస్ లో ఓ వాలంటీర్ ఫిర్యాదు మేరకు పవన్ పై కేసు కూడా నమోదు చేశారు. పవన్ కల్యాణ్ - వైసీపీ లకు మధ్య జరుగుతున్న ఈ డేటాలీక్ వ్యవహారం ఎంతకు దారితీస్తుందో చూడాలి.