అనడమెందుకు.. క్షమాపణలెందుకు?
కోనసీమ జిల్లాలో వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన సీపీఐ నేత నారాయణను జనసేన క్యాడర్ వెంబడించింది.
సీపీఐ నారాయణ రూటే వేరు. ఆయన నాలుక ఇష్టమొచ్చినట్లు తిరుగుతుంది. చికెన్ తిని తిని నాలుక మడత పడినట్లుందన్న కామెంట్స్ వినడుతున్నాయి. మైకులు కనపడితే నారాయణ రెచ్చి పోతారు. ప్రజా బలం లేకపోయినా నారాయణ మాటలతో నిత్యం వార్తల్లో కెక్కుతున్నారు. అల్లూరి సీతారామరాజు శతదినోత్సవ వేడుకలకు చిల్లర బేరగాడు చిరంజీవిని ఎందుకు తీసుకెళ్లారని నారాయణ ప్రశ్నించారు. అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించిన కృష్ణకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఊసరవెల్లి చిరంజీవిని ఎందుకు వేదికపై కి పిలిచారని నారాయణ ప్రశ్నించారు.
మండి పడుతున్న...
అయితే దీనిపై రాష్ట్రంలో మెగా ఫ్యాన్స్ మండి పడుతున్నారు. దీంతో నారాయణ రాజమండ్రిలో తాను చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని అన్నారు. భాషాదోషం వల్లనే ఆ పదాలు దొర్లాయని, చిరంజీవి తనకు మంచి మిత్రుడని, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా తాను కలిస సంఘీభావం తెలిపానని నారాయణ అన్నారు. తన మాటలకు నొచ్చుకుంటే క్షమించాలని కూడా నారాయణ అన్నారు.
వెంటాడుతున్న....
అయినా మెగా ఫ్యాన్స్ వదిలిపెట్టడం లేదు. కోనసీమ జిల్లాలో వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన నారాయణను జనసేన క్యాడర్ వెంబడించింది. నారాయణను అసభ్య పదజాలంతో దూషించింది. చిరంజీవిని అనే స్థాయి నారాయణకు లేదని బూతు పదాలను అందుకున్నారు. మరోసారి నారాయణ చెప్పేందుకు ప్రయత్నించినా అడుగడుగునా జనసేన కార్యకర్లలు ఆయన పర్యటనను అడ్డుకున్నారు. స్థానిక సీపీఐ నేతలు జనసేన నాయకులకు సర్ది చెప్పాల్సి వచ్చింది.