నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు : వైఎస్ అవినాష్ రెడ్డి
కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. ఆయన రిట్ పిటీషన్ దాఖలు చేశారు;
కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. ఆయన రిట్ పిటీషన్ దాఖలు చేశారు. సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని పిటీషన్ లో పేర్కొన్నారు. సీబీఐ అధికారులు మూడోసారి విచారణకు హాజరు కావాలని వైఎస్ అవినాష్ రెడ్డికి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తనను అరెస్ట్ చేయకుండా...
160 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చారు కాబట్టి తనను అరెస్ట్ చేయొద్దని అవినాష్ రెడ్డి పిటీషన్ లో కోరారు. విచారణ మొత్తం వీడియో రికార్డింగ్ చేయాలని, న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని పిటిషన్ వేశారు. ఏ 4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఇప్పటి వరకూ సీబీఐ అరెస్ట్ చేయలేదన్నారు, దస్తగిరి ముందస్తు బెయిల్ పిటీషన్ విషయంలోనూ సీబీఐ వ్యతిరేకించలేదని, అక్కడ, ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగానే విచారణ కొనసాగుతుందని వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారి దర్యాప్తు పారదర్శకంగా లేదని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు.