Kanna Lakshmi Narayana : కన్నా మంత్రి పదవికి అదే అడ్డుపడిందా? లేకుంటే మంత్రి అయ్యేవారా?
చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో చోటు దొరకక తీవ్ర నిరాశకు గురయిన నేత ఎవరైనా ఉన్నారంటే అందులో కన్నా లక్ష్మీనారాయణ ఒకరు
చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో తీవ్ర నిరాశకు గురయిన నేత ఎవరైనా ఉన్నారంటే అందులో కన్నా లక్ష్మీనారాయణ ఒకరని చెప్పకతప్పదు. ఎలా చూసుకున్నా ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. ఎందుకంటే సీనియర్ మోస్ట్ నేత ఆయన. కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ లో ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా గుంటూరు జిల్లా కోటా కింద మంత్రి అయ్యే వారు. సీనియారిటీ మాత్రమే కాకుండా సామాజికవర్గం కూడా అదనపు బలం అయి కన్నా లక్ష్మీనారాయణకు ప్రతిసారీ మంత్రి పదవి దక్కేది. కానీ ఈసారి అవే ఆయనకు శాపంగా పరిణమించాయని చెప్పక తప్పదు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కారణంగానే కన్నాకు మంత్రి పదవి రాలేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
పార్టీలు మారి వచ్చి...
కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర విభజనకు ముందు కూడా మంత్రివర్గంలో ఉన్నారు. ఆయన విభజన జరిగిన తర్వాత తొలుత వైసీపీలో చేరాలనుకున్నా అనుకోని పరిస్థితుల్లో ఆయన బీజేపీలో చేరారు. ఆయన ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ రెండేళ్ల తర్వాత ఆయనను పదవి నుంచి తొలగించడంతో మనస్తాపం పొందిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. కానీ ఆయన జనసేనలో చేరతారని తొలుత అందరూ అనుకున్నప్పటికీ అందరి అంచనాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కన్నా చేరిన తర్వాత చంద్రబాబు కూడా ప్రయారిటీ ఇచ్చారు. కోడెల కుటుంబాన్ని కాదని చంద్రబాబు సత్తెనపల్లి టిక్కెట్ ను కన్నా లక్ష్మీనారాయణకు ఇచ్చారు.
గ్యారంటీ అనుకున్నా...
ఇక సత్తెనపల్లిలో గెలిచిన వెంటనే చంద్రబాబు కేబినెట్ లో ఆయనకు గ్యారంటీ అని అనుకున్నారు. కాపుల కోటాలో కూటమి పార్టీల నుంచి , పవన్ కళ్యాణ్, నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, పొంగూరు నారాయణలకు అవకాశం దక్కింది. టీడీపీ కోటాలో దక్కించుకున్న ఇద్దరిలో నిమ్మల రామానాయుడు కాపు సామాజికవర్గమైనా మూడుసార్లు గెలిచి పార్టీకోసం నమ్మకంగా పనిచేశారు. పొంగూరు నారాయణ ఆర్థికంగా పార్టీని ఆదుకున్న వారిలో ఒకరు. ఇలా వీరిద్దరినీ కాదని చంద్రబాబు కన్నా లక్ష్మీనారాయణకు స్థానం కల్పించలేకపోయారన్న వాదనలో వాస్తవమయితే ఉంది. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు లాంటి వారిని కూడా పక్కన పెట్టడం ఈ కేబినెట్ లో చూశాం. కాపు సామాజికవర్గంలో ఎక్కువ మంది ఉండటం కారణంగానే కన్నా లక్ష్మీనారాయణకు కేబినెట్ లో చోటు దక్కలేదంటారు.
ఇవీ కారణాలు...
ఇక కన్నా లక్ష్మీనారాయణకు మరో ఇబ్బంది కూడా ఉంది. ఆయన బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడం శాపంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడటంతో బీజేపీ నుంచి వచ్చిన వారికి కేబినెట్ లో చోటు కల్పిస్తే కొంత ఇబ్బందులు ఎదురవుతాయని భావించి ఉండవచ్చు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి వస్తున్న సమయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన నేతను తన కేబినెట్ లోకి తీసుకుంటే బాగుండదన్న భావన కూడా కలిగి ఉండవచ్చు. అదే సమయంలో మరో బలమైన కారణం గుంటూరు జిల్లాలో జనసేన నుంచి నాదెండ్ల మనోహార్, రేపల్లె ఎమ్మెల్యేగా గెలిచిన అనగాని సత్యకుమార్, మంగళగిరి నుంచి నారా లోకేష్ కు మూడు పదవులు ఇవ్వాల్సి రావడం వల్ల కూడా కన్నా లక్ష్మీనారాయణను పక్కన పెట్టారని తెలిసింది. మొత్తం మీద కన్నా ఆశలు మాత్రం ఈసారి నెరవేరలేదనే చెప్పాలి.