సోము ప్రవర్తన వల్లే రాజీనామా : కన్నా
సోము వీర్రాజు ప్రవర్తన బాగా లేకనే తాను మనస్తాపానికి గురై రాజీనామా చేశానని కన్నాలక్ష్మీనారాయణ తెలిపారు
2014లో పార్టీలో చేరిన తాను బీజేపీకి రాజీనామా కొన్ని పరిస్థితుల కారణంగా చేయాల్సి వచ్చిందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన ముఖ్య అనుచరులతో సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 2018లో తనను బీజేపీ అధ్యక్షుడిగా చేశారన్నారు. ఎన్నికలకు పది నెలల ముందే పార్టీ పగ్గాలు చేపట్టినా కష్టపడి ఎన్నికల్లో పనిచేశానని అన్నారు. ఎన్నికల తర్వాత కూడా బీజేపీ తరుపున అనేక పోరాటాలు చేశామన్నారు. అమరావతిలోనే రాజధానిని ఉంచాలని తాము ఆందోళన చేస్తామన్నారు. జగన్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనలు తెలియజేశామన్నారు.
అప్పటి నుంచే...
సోము వీర్రాజు అధ్యక్షుడి అయిన నాటి నుంచి కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారన్నారు. అప్పటి నుంచి పార్టీలో పరిస్థితులు మారాయన్నారు. సోము వీర్రాజు ప్రవర్తన బాగా లేకనే తాను మనస్తాపానికి గురై రాజీనామా చేశానని తెలిపారు. తన వర్గానికి చెందినవారిని పదవుల నుంచి తప్పించారన్నారు. తనతో పాటు తన మిత్రులు కూడా బీజేపీకి రాజీనామా చేశారని ఆయన తెలిపారు. తాను ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాజీనామా లేఖ పంపానని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. కాపులను బీసీలలో చేర్చడం, రంగా వర్ధంతి, జయంతులను నిర్వహించడం వల్లనే ఓవర్‌నైట్ నాయకులుగా ఎదగలేరన్నారు. వైసీపీ హయాంలోనే కాపు సామాజికవర్గానికి అన్యాయం జరిగిందన్నారు. తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.