అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. అవి బయటకు రాకూడదు
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ సమయంలో సీఐడీకి ఏసీబీ కోర్టు జడ్జి పలు కండిషన్లను విధించారు. ముఖ్యంగా విచారణ ఫొటోలు, వీడియోలు బయటకు రాకూడదని సీఐడీకి సూచించారు. విచారణ వివరాలను మీడియాకు వెల్లడించకూడదని.. కస్టడీ విచారణ నివేదికను సీల్డ్ కవర్ లో ఇవ్వాలని తెలిపారు. చంద్రబాబును ఆయన లాయర్ల సమక్షంలోనే విచారించాలని, ఆయన ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చంద్రబాబు ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. కస్టడీ మగిసిన వెంటనే కోర్టులో ప్రవేశ పెట్టాలని సూచించారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 140 మంది సాక్షులను విచారించారని, 4 వేల కాపీలను అందజేశారని న్యాయమూర్తి తెలిపారు. పోలీసుల విచారణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. ఈ దశలో క్వాష్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోలేమని తెలిపారు. ఈ సందర్భంగా నీహారిక వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను న్యాయమూర్తి ఉదహరించారు. విచారణ కీలక దశలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆపడం సరికాదు. ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప ప్రతిసారి పిటిషన్‌ను క్వాష్ చేయలేం.అసాధారణ పరిస్థితుల్లో ఉంటేనే ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలి. ఎఫ్‌ఐఆర్‌లో అన్ని విషయాలు ఉండాల్సిన అవసరం లేదు. విచారణ పూర్తి చేసే అధికారాన్ని పోలీసులకు ఇవ్వాలి. విచారణ అంశాలను తర్వాతి దశలో ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయొచ్చని తెలిపారు.