కోటప్పకొండ తిరునాళ్లు.. రికార్డు స్థాయిలో ఆదాయం
తమ ఇష్టదైవానికి మొక్కులు చెల్లించుకుని, పంచాక్షరి మంత్ర పఠనంతో భక్తులు తన్మయత్వం పొందారు. ఫిబ్రవరి 18న మహా శివరాత్రి..
కోటప్పకొండ అనగానే.. అందరికీ గుర్తొచ్చేది మహా శివరాత్రి తిరునాళ్లు, ప్రభలు. రంగురంగుల విద్యుత్ దీప కాంతుల్లో.. అశేష భక్త జన సందోహం మధ్య జరిగే కోటయ్య ఉత్సవాలకు ఏపీలోని భక్తులతో పాటు.. పొరుగు రాష్ట్రాల భక్తులు కూడా విచ్చేస్తుంటారు. మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండ మొత్తం శివనామస్మరణతో మారుమ్రోగిపోతుంది. లక్షలాది మంది భక్తుల రాకతో.. త్రికూట పర్వతం సందడిగా మారింది.
తమ ఇష్టదైవానికి మొక్కులు చెల్లించుకుని, పంచాక్షరి మంత్ర పఠనంతో భక్తులు తన్మయత్వం పొందారు. ఫిబ్రవరి 18న మహా శివరాత్రి సందర్భంగా.. కోటప్పకొండ తిరునాళ్లకు విచ్చేసిన భక్తులు ఆ త్రికోటేశ్వరుడిని దర్శించుకుని.. వివిధ రూపాల్లో స్వామివారికి రూ.కోటి 73లక్షల 67 వేల 386 ఆదాయాన్ని సమర్పించారు. వివిధ రకాల పూజ టిక్కెట్ల ద్వారా రూ.65,01,240, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 35,00,025 వచ్చింది. అన్నదానం కానుకల ద్వారా రూ.1,21,321, హుండీల కానుకల ద్వారా రూ.72,44,803 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారి వేమూరి గోపి తెలిపారు.
గతేడాది వచ్చిన ఆదాయంతో పోలిస్తే.. ఈ ఏడాది రూ.4,30,519 ఆదాయం అదనంగా వచ్చిందని ఆయన పేర్కొన్నారు. తిరునాళ్లలో చివరి ఘట్టమైన లింగోద్భవ కాలంలో శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేక మహోత్సవాల్లో పాల్గొని, కొండపై జాగరణ చేశారు.