Nagarjuna Sagar : డ్యామ్ పైకి కేంద్ర బలగాలు.. ఇక వారి చేతుల్లోనే
నాగార్జున సాగర్ వివాదాన్ని పరిష్కరించేందుకు కృష్ణా వాటర్ బోర్డు అన్ని చర్యలు చేపట్టింది. కేంద్ర బలగాలను రప్పించింది
నాగార్జున సాగర్ వివాదాన్ని పరిష్కరించేందుకు కృష్ణా వాటర్ బోర్డు అన్ని చర్యలు చేపట్టింది. కేంద్ర బలగాలను రప్పించింది. ఇప్పటికే డ్యామ్ మీదకు చేరుకున్న కేంద్ర బలగాలు సాగర్ డ్యామ్ వద్ద పహారా కాస్తున్నాయి. ఒక్కో పాయింట్‌ను వారు తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. సాగర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలన్న ప్రతిపాదనను ఏపీ, తెలంగాణలు అంగీకరించడంతో వారు కేంద్ర బలగాలను రప్పించారు. పదమూడో గేటు వద్ద ఏపీ ప్రభుత్వాధికారుల ఉంచిన కంచెను తొలగించే అవకాశాలున్నాయి.
నేడు కీలక సమావేశం...
నేడు కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో కృష్ణా జలాలపై కీలక సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ చీఫ్ సెక్రటరీలు, సీఆర్పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ డీజీలు..సీడబ్ల్యూసీ , కేఆర్‌ఎంబీ చైర్మన్‌లు హాజరయ్యారు. సాగర్‌తో పాటు శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వహణపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదం కేసు విచారణ జనవరి 12కు వాయిదా పడింది. కృష్ణా ట్రిబ్యూనల్‌కు నూతన విధివిధానాలపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింద . పిటీషన్‌ను విచారించిన సుప్రీం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి,తెలంగాణకు నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలకు కేంద్ర జలశక్తి శాఖ సమయం కోరడంతో తదుపరి విచారణను 12కు వాయిదా పడింది.