పవన్.. దమ్ముంటే కర్నూల్‌లో పోటీ చెయ్.. ఎమ్మెల్యే సవాల్
పోటీ చేసిన రెండుచోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్‌కి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటనపై అధికార వైసీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ మేరకే పవన్ పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. జనసేనాని పవన్ కళ్యాణ్‌పై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్‌కి జగన్ సర్కార్‌ని విమర్శించే అర్హత ఉందా అని హఫీజ్ ప్రశ్నించారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు.
గోదావరి జిల్లాల్లో కంటే ఘోరంగా ఓడించేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపు 95 శాతం ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చారని.. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కాయన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్‌కి స్క్రిప్ట్ ఇచ్చి చదవమంటున్నారని.. అదే ఆయన చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు రైతుల గురించి మాట్లాడడం కాదు.. గతంలో చంద్రబాబు కర్నూలుకి ఇచ్చిన హామీలపై పవన్ మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.
జనసేనాని ఒకవైపు బీజేపీతో కాపురం చేస్తూ మరోవైపు టీడీపీతో జతకట్టేందుకు తహతహలాడుతున్నారని హఫీజ్ విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు. తన ఉనికి కాపాడుకోవడం కోసమే పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కర్నూలులోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.