యాపిల్ తో పోటీ పడుతోన్న నిమ్మకాయ
తాజాగా నెల్లూరు జిల్లాలో నిమ్మకాయ.. యాపిల్ రేటుతో పోటీ పడుతోంది. ఆదివారం గూడూరు మార్కెట్లో నిమ్మకాయలు రికార్డు ధర పలికాయి.
నెల్లూరు : వేసవిలో ఉండే తాపం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాపాన్ని తీర్చుకునేందుకు చల్లటి పానీయాలు తాగుతుంటారు. వాటిలో నిమ్మరసం కూడా ఒకటి. అందుకే వేసవికి ముందు వరకూ చాలా చవకగా దొరికే నిమ్మకాయకు.. వేసవి రాకతో ఎక్కడ లేని గిరాకీ ఏర్పడుతుంది. ఇప్పటికే మార్కెట్లో ఒక నిమ్మపండు రూ.10కి అమ్ముతున్నారు. దాంతో నిమ్మకాయలు కొనాలంటేనే సామాన్యుడు భయపడుతున్నాడు.
తాజాగా నెల్లూరు జిల్లాలో నిమ్మకాయ.. యాపిల్ రేటుతో పోటీ పడుతోంది. ఆదివారం గూడూరు మార్కెట్లో నిమ్మకాయలు రికార్డు ధర పలికాయి. మార్కెట్ కు ఓ రైతు తీసుకొచ్చిన మొదటి రకం నిమ్మకాయలను వ్యాపారులు కిలో రూ.160 చొప్పున కొనుగోలు చేశారు. రెండో రకం నిమ్మకాయలు రూ. 130-150 మధ్య పలుకుతుండగా, నిమ్మ పండ్లు రూ. 100-130 మధ్య ధర పలుకుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నిమ్మకాయల ధరలకు రెక్కలొచ్చాయి. కిలో యాపిల్ పండ్లకు, కిలో నిమ్మకాయలకు పెద్ద తేడా లేదంటున్నారు వినియోగదారులు. జిల్లాలో కిలో యాపిల్ పండ్లు రూ.150-200 మధ్య అమ్ముడవుతున్నాయి.