తిరుమలలో బాలుడిపై దాడి చేసిన చిరుత దొరికేసింది

అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద బాలుడిపై చిరుత దాడి చేసిన ప్రదేశాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు.

Update: 2023-06-24 02:18 GMT

తిరుమల అలిపిరి మార్గంలో ఏడో మైలు దగ్గర బాలుడిపై దాడి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో శుక్రవారం రాత్రి 10.45 గంటలకు చిక్కింది. ఈ చిరుతను పట్టుకునేందుకు అధికారులు అలిపిరి నడకదారి మార్గంలో.. శుక్రవారం సాయంత్రం రెండు బోనులు ఏర్పాటు చేశారు.. 100కుపైగా కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కరోజులోనే చిరుతను బంధించారు. ఈ చిరుతకు ఏడాదిన్నర వయసు ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడిప్పుడే వేటాడే లక్షణాలు అలవాటు అవుతున్నాయని.. అందుకే బాలుడిని లాక్కెళ్లిన సమయంలో వదిలేసినట్లు చెబుతున్నారు. పిల్లిని వేటాడుతూ చిరుత భక్తులు వెళ్లే మార్గంవైపు వెళ్లిందని.. పిల్లి తప్పించుకోవడంతో బాలుడిపై దాడికి ప్రయత్నించిందని చెప్పారు. ఈ ఘటన యాధృచ్చికంగా జరిగిన ఘటన అని అంటున్నారు. టీటీడీ అటవీ శాఖ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారు.. అలిపిరి గాలిగోపురం నుంచి నరసింహస్వామి గుడి వరకు చిరుత సంచరిస్తున్నట్టుగా తెలుసుకుని బోన్లను ఏర్పాటు చేశారు.

గురువారం రాత్రి అలిపిరి నడకదారి మార్గంలో ఓ కుటుంబం తిరుమలకు నడిచి వెళుతోంది. ఈ క్రమంలో బాలుడు తాతతో కలిసి ఓ షాపు దగ్గర కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తున్నాడు. ఇంతలో ఏడో మైలు దగ్గర బాలుడిపై చిరుత దాడి చేసి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. భక్తులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అధికారులు, అక్కడ ఉన్న వ్యక్తులు, పోలీసులు కేకలు వేయడంతో చిరుత పిల్లాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది.అటవీ ప్రాంతంలోకి వెళ్లి చూడగా 150 మీటర్ల దూరంలో బాలుడ్ని గుర్తించారు. బాలుడికి గాయాలు కాగా వెంటనే తిరుపతిలోని చిన్న పిల్లల ఆస్పత్రికి తరలించారు. బాలుడికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు.
అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద బాలుడిపై చిరుత దాడి చేసిన ప్రదేశాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. బాలుడిపై దాడి చేసింది పిల్లచిరుత కావడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. దాడి జరిగిన సమయంలో భక్తులు పెద్దగా అరవడం, రిపీటర్ స్టేషన్ నుంచి లైట్లు వేయడంతో చిరుత బాలుడిని వదిలి వెళ్లిపోయిందన్నారు.


Tags:    

Similar News