Liquor Shops : ఏపీలో ఒకే చోట్ల పక్క పక్కన మద్యం షాపులు...విస్తుపోతున్న జనం

ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల లాటరీ పూర్తయింది. కొండపల్లిలో రెండు షాపులు పక్క పక్కనే వెలిశాయి

Update: 2024-10-19 06:50 GMT

ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల లాటరీ పూర్తయింది. కొత్తగా మద్యం దుకాణాలు వెలిశాయి. అయితే ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే మద్యం దుకాణాలను నిర్వహించాలన్నది ఎక్సైజ్ శాఖ తమ నిబంధనల్లో పేర్కొంది. ఏ ప్రాంతంలో మద్యం దుకాణం పెట్టుకోవాలో ముందుగానే నిర్ణయించి టెండర్ ను ఆహ్వానించింది. దాని ప్రకారమే లైసెన్స్ ఫీజు చెల్లించిన వారి పేర్లను లాటరీ తీసి మద్యం దుకాణాలను కలెక్టర్ నేతృత్వంలో షాపులు కేటాయించారు. ఇంత వరకూ బాగానే ఉంది. కాని విజయవాడ సమీపంలోని కొండపల్లి పట్టణంలో మాత్రం విచిత్రం జరిగింది. పక్క పక్కనే మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇద్దరూ పోటా పోటీగా...
రెండు వైన్ షాపులను పక్కపక్కనే ఏర్పాటు చేయడంతో మందుబాబులకు ఇబ్బంది లేకపోయినా శాంతి భద్రతలకు ఇబ్బంది కలుగుతుందేమోనన్న ఆందోళన తలెత్తుతోంది. నిజానికి ఎక్సైజ్ శాఖ కొండపల్లి పట్టణానికి రెండు, ఇబ్రహీంపట్నం మండలంలో మూడు వైన్స్ షాపులను కేటాయించింది. ఈ దుకాణాలను లాటరీలో దక్కించుకున్న వారు షాపులను ఏర్పాటు చేయడంలో ఒకింత అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. మైలవరానికి చెందిన వైసీపీ నేత ఒకరు ఈ దుకాణాన్ని దక్కించుకుని కొండపల్లి పట్టణంలో షాపును ఏర్పాటు చేశాడు. అలాగే గుంటుపల్లికి చెందిన మరొక వ్యక్తి మరొక దుకాణాన్ని ఆ పక్కనే ఏర్పాటు చేయడాన్ని చూసిన జనం విస్తుపోతున్నారు.
భారీగా ఆదాయం వస్తుందని...
రెండు మద్యం దుకాణాలు పక్కపక్కనే ఉండి అవి ప్రారంభం కావడంతో పాటు ఒక మద్యం షాపునకు కనకదుర్గ వైన్స్, మరొక దుకాణానికి వెంకట దుర్గ వైన్స్ అని పేరు పెట్టారు. అసలే మందుబాబులు. ఆ పైన పేర్లు కూడా ఒకటే. దీంతో అక్కడ గొడవలు అయ్యే అవకాశముందని ఎక్సైజ్ శాఖ కూడా భావిస్తుంది. ఇక్కడ ఎక్కువ బిజినెస్ జరుగుతుండటంతోనే పోటీ పడి మరీ ఈ వైన్ షాపులను ప్రారంభించారని అంటున్నారు. గతంలో ప్రభుత్వం ఇక్కడ ఒక మద్యం షాపు నిర్వహించేది. రోజు వారీగా నాలుగు లక్షల రూపాయల వరకూ మద్యం విక్రయాలు జరిగేవి. ఆదివారం, పండగ, సెలవు దినాల్లో ఐదు నుంచి ఏడు లక్షల రూపాయల వరకూ బిజినెస్ జరుగుతుండటంతో ఇక్కడ రెండు దుకాణాలను పక్క పక్కనే పెట్టారంటున్నారు. ఎక్సైజ్ శాఖ మాత్రం ఈ దుకాణాల్లో ఒకదానిని తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News