రేపే మహాకుంభ సంప్రోక్షణ.. ఆరేళ్ల తర్వాత స్వయంభూ దర్శనం
భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా.. ఆలయ ప్రాంగణమంతా పోలీస్ బలగాలను మోహరించారు.
యాదాద్రి భువనగిరి : యాదాద్రి ఆలయంలో రేపే మహాకుంభ సంప్రోక్షణ జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. సుమారు ఆరేళ్ల తర్వాత భక్తులకు స్వయంభూ లక్ష్మీ నారసింహస్వామి తనివితీరా దర్శనమివ్వనున్నాడు. సోమవారం మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన అనంతరం.. సాధారణ భక్తులను స్వామిదర్శనానికి అనుమతించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా.. ఆలయ ప్రాంగణమంతా పోలీస్ బలగాలను మోహరించారు. ప్రధాన ఆలయం, స్వయంభూ మూర్తి దర్శనానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని ఆలయ అధికారుల అంచనా. గడిచిన ఆరేళ్లలో బాలాయంలో ఉన్న నారసింహస్వామిని రోజుకు 8 వేల మంది దర్శించుకోగా.. ఇప్పుడు ఆ సంఖ్య 20 వేలకు చేరుతుందని భావిస్తున్నారు. అలాగే సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో దర్శించుకునే వారి సంఖ్య 30 వేల నుంచి 50 వేల వరకు పెరిగే అవకాశ ం ఉందన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పూజలు, ఉత్సవాల ఏర్పాట్లు, ప్రొటోకాల్ అరేంజ్‌మెంట్లు, అతిథుల విడిది, గదుల కేటాయింపు, నీరు, భోజన వసతి, బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ వంటి వాటిపై సమీక్షించారు.