దూసుకొస్తున్న మాండూస్..నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

పుదుచ్చేరి, మహా బలిపురం, శ్రీహరికోట మధ్య తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో.. నేడు, రేపు కోస్తాంధ్ర లో..

Update: 2022-12-09 02:52 GMT

mandous severe cyclonic storm

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను.. నిన్న సాయంత్రం తీవ్రతుపానుగా మారింది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాల వైపు దూసుకొస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరాన్ని తాకే క్రమంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎస్ జవహర్ రెడ్డి సూచించారు.

పుదుచ్చేరి, మహా బలిపురం, శ్రీహరికోట మధ్య తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో.. నేడు, రేపు కోస్తాంధ్ర లో భారీ నుంచి అతి భారీవర్షాలు, రాయలసీమలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 65-85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
అత్యవసరమైతే తప్ప..ప్రజలు బయటికి రావొద్దని, రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్‌ ఆదేశించారు.





Tags:    

Similar News