తీవ్ర తుపానుగా మాండూస్.. రెండ్రోజులు అత్యంత భారీవర్షాలు

ప్రస్తుతం ఈ తుపాను తమిళనాడులోని కారైక్కాల్ కు తూర్పు ఆగ్నేయంగా 420, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 520 కిలోమీటర్ల..;

Update: 2022-12-08 11:35 GMT
severe cyclonic storm, mandouse cyclone update

severe cyclonic storm

  • whatsapp icon

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను మరింత బలపడినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ తుపాను తమిళనాడులోని కారైక్కాల్ కు తూర్పు ఆగ్నేయంగా 420, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్యదిశగా పయనించి తుపానుగా బలహీనపడుతుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. 9వ తేదీ రాత్రి పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య తీరాన్ని దాటి మహాబలిపురం వద్ద భూభాగంపై ప్రవేశిస్తుందని వివరించింది. గడచిన 6 గంటలుగా ఈ తీవ్ర తుపాను గంటకు 12 కిమీ వేగంతో కదులుతోంది.

ఈ తుపాను ప్రభావంతో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు ఈ నెల 10వ తేదీ వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తుపాను కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. చెన్నై నుండి సింగపూర్, ముంబై వెళ్ళాల్సిన 11 విమానాల దారి మళ్లించారు. అలాగే తూత్తూకుడి, షిరిడీకి వెళ్లే నాలుగు విమానాలు రద్దు చేశారు.


Tags:    

Similar News