Rain Alert : ఏపీలో వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరికలు ఇవే
ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖవెల్లడించింది
ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖవెల్లడించింది. నిన్న విజయవాడలో కురిసిన వానకు రహదారులన్నీ జలమయమయ్యాయి. రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పడంతో ఏపీ వాసులు ఒకింత ఊరట చెందుతున్నారు. మొన్నటి వరకూ ఉక్కపోతతో ఇబ్బంది పడిన ఏపీ ప్రజలకు నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు కొంత ఊరటనిచ్చే విధంగా ఉన్నాయి. దీంతో పాటు కొన్ని జిల్లాల్లో ఒక మోస్తరు గానూ, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. గంటలకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నమోదవుతుందని కూడా తెలపడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ జిల్లాల్లో...
ఈరోజు కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అంటే రాయలసీమలోనే అత్యధికంగా వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. రాయలసీమలో భారీ వర్షాల కారణంగా కొన్ని చో్ట్ల రాకపోకలు నిలిచిపోయాయి. కడప జిల్లా తుమ్మలగుంటలో పిడుగుపడి ముగ్గురు చనిపోయారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. దీంతో నేడు, రేపు కూడా వర్షాలు పడతాయన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.