అదేరోజు పవన్ పర్యటన.. అది తెలిసిందేగా?
పదిహేనో తేదీనే విశాఖలో పవన్ కల్యాణ్ కార్యక్రమం పెట్టడం వెనక ఉద్దేశ్యం ఏంటని మంత్రి అమరనాధ్ ప్రశ్నించారు.
పదిహేనో తేదీనే విశాఖలో పవన్ కల్యాణ్ కార్యక్రమం పెట్టడం వెనక ఉద్దేశ్యం ఏంటని మంత్రి అమరనాధ్ ప్రశ్నించారు. చంద్రబాబు పేకలో జోకర్ లా పవన్ కల్యాణ్ ఉపయోగపడుతున్నారన్నారు. అనేక సందర్భాల్లో ఈ విషయం రుజువయిందన్నారు. ఏదైనా డైవర్ట్ చేయడానికి పవన్ కల్యాణ్ ముందుంటారని ఆయన తెలిపారు. పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని పెట్టింది కేవలం డైవెర్ట్ చేయడానికేనని అన్నారు. జనవాణి కంటే ముందు విశాఖ ప్రాంతంపై మీ వాణి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖకు రాజధాని వస్తుందంటే ఎందుకంత కక్ష అని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 15న విశాఖ గర్జన జరుగుతున్నప్పుడే పవన్ కల్యాణ్ కార్యక్రమం పెట్టడం వెనక ఉన్న ఉద్దేశ్యం అందరికీ తెలుసునని అన్నారు.
అవగాహన ఉందా?
25 రాజధానులు ఎవరైనా పెడతారా? అని, ఫెడరల్ విధానంపై అవగాహన ఉందా? అని పవన్ ను గుడివాడ అమరనాధ్ ప్రశ్నించారు. జనవాణి కార్యక్రమంలో మిమ్మల్ని ఖచ్చితంగా వచ్చి ప్రజలు ప్రశ్నిస్తారని ఆయన అన్నారు. గాజువాకలో పోటీ చేస్తే ఓడించారని ఈ ప్రాంతం పై కక్ష కట్టారా? అని నిలదీశారు. మీకు నటన నేర్పింది విశాఖ కదా? జగదాంబ వీధుల్లో మీరు తిరగలేదా? అమరనాథ్ ఎదురుదాడికి దిగారు. మీకు అనేక రాణిధానులున్నాయని, అంతర్జాతీయ రాజధాని మాస్కో ఉందని, జాతీయ రాజధాని ముంబయి ఉందని, అసలు రాజధాని హైదరాబాద్ మీకు ఉందని ఎద్దేవా చేశారు. గతంలో మీరు చెప్పిన మాటలను మీరు గుర్తు చేసుకున్నారా? అని అన్నారు. కర్నూలు వెళ్లి అక్కడ రాజధాని అన్నావు. అమరావతి రాజధాని ప్రాంతానికి ఎవరు సీమ ప్రాంత వాసులు వస్తారన్నావు? ఇవన్నీ మరిచిపోయావా? అని అమరనాథ్ ప్రశ్నించారు.