హామీల వర్షాన్ని కురిపిస్తున్న మంత్రి రోజా
తిరుపతిలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు పాత్రను పోషిస్తానని చెప్పారు. చంద్రగిరి కోట అభివృద్ధికి కృషి..
తిరుపతి : నటి, ఎమ్మెల్యే రోజాకు ఇటీవలే మంత్రి పదవి దక్కిన సంగతి తెలిసిందే..! రోజాకు పర్యాటక, సాంస్కృతిక, యూత్ వెల్ఫేర్ శాఖలను ఇచ్చారు. మంత్రి పదవిని చేపట్టిన రోజాను తిరుపతిలో ఏపీ హోటల్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఆమె మాట్లాడుతూ, పలు విషయాలను పంచుకున్నారు. చదువుకుంటున్న తనను సినీ రంగంలోకి తీసుకెళ్లింది మాజీ ఎంపీ, దివంగత శివప్రసాదేనని చెప్పి, ఆయనను గుర్తు చేసుకున్నారు. పర్యాటక రంగానికి సంబంధించి హోటళ్లు ప్రధాన భూమికను పోషిస్తాయని, కరోనా వల్ల హోటల్ నిర్వాహకులు చాలా నష్టపోయారని తెలిపారు.
తిరుపతిలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు పాత్రను పోషిస్తానని చెప్పారు. చంద్రగిరి కోట అభివృద్ధికి కృషి చేస్తానని, ఏపీ టూరిజంకు టీటీడీ దర్శన టికెట్ల కోటాను పెంచేలా యత్నిస్తానని హామీ ఇచ్చారు. హోటల్ నిర్వాహకుల విన్నపం మేరకు హోటళ్ల పనివేళలను పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఏపీలోని అన్ని పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేలా ఒక యాప్ ను రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఇక రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చేస్తానని మంత్రి రోజా తెలిపారు. క్రీడల్లో సరైన ప్రోత్సాహం లేకపోవడంతో ట్యాలెంట్ ఉన్న వాళ్లు వెనుకబడిపోతున్నారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో స్పోర్ట్స్ క్లబ్ అభివృద్ధి చేస్తామన్నారు. స్పోర్ట్స్ ఆడడం వల్ల మానసిక స్థైర్యం వస్తుందని రోజా తెలిపారు.