సస్పెన్షన్‌పై ఆనం తొలి రెస్పాన్స్
తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తొలిసారి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు
తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తొలిసారి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. విలువలు లేని సలహాదారులు అనే మాటలను తాను లెక్క చేయనని ఆయన అన్నారు. క్రాస్ ఓటింగ్ చేశానో లేదో చెప్పాల్సింది తాననని, సజ్జల రామకృష్ణారెడ్డి కాదని అన్నారు. తాను క్రాస్ ఓటింగ్ చేసినట్లు సజ్జలకు ఎలా తెలుసునని ఆనం ప్రశ్నించారు. వైసీపీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఇరవై కోట్లు తీసుకున్నారని ఆరోపణలు చేయడం దారుణమని ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు.
సజ్జల అవినీతిపరుడు...
సజ్జల రామకృష్ణారెడ్డి సామాన్య విలేకరిగా జీవితాన్ని ప్రారంభించి వందల కోట్లు సంపాదించారని ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. తాను క్రాస్ ఓటింగ్ చేసినట్లు ఎన్నికల కమిషన్ చెబితే తాను ఒప్పుకుంటానని ఆయన అన్నారు. అంతే తప్ప ఒకరిపై బట్ట కాల్చి వేయడం సరికాదని అన్నారు. సలహాదారు ఉద్యోగానికి సజ్జలకు ఎన్నికోట్ల ఇచ్చారని ఆనం ప్రశ్నించారు. తాను ఎందరో ముఖ్యమంత్రుల వద్ద పనిచేశానని, ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొనలేదని ఆయన అన్నారు. సజ్జల అవినీతి పరుడంటూ ఆయన ధ్వజమెత్తారు.