ఏపీలోకి ఎంటరైన రుతుపవనాలు.. కానీ
రానున్న 2,3 రోజుల్లో కడప, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, కర్నూల, నంద్యాల జిల్లాలకు రుతుపవనాలు
ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోట సమీప ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఇవి ఉత్తరకోన శ్రీహరికోట, కర్ణాటక, తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హాసన్ తదితర ప్రాంతాలపై ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు మరికొన్ని ప్రాంతాలకు విస్తరించి జల్లులు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
అయితే ఏపీలో ప్రస్తుతం రాయలసీమలోకి మాత్రమే రుతుపవనాలు ప్రవేశించాయని, రానున్న 2,3 రోజుల్లో కడప, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, కర్నూల, నంద్యాల జిల్లాలకు రుతుపవనాలు వ్యాపిస్తాయని రాష్ట్ర వాతావరణ విభాగం తెలిపింది. ఇవి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలకు వ్యాపించేందుకు మరింత సమయం పడుతుందని, అప్పటి వరకూ వేడిగాలుల ప్రభావంతో పాటు, అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలిపింది.
తెలంగాణలో రానున్న మూడు రోజులకు వాతావరణ సమాచారాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు, రేపు, ఎల్లుండి (జూన్ 11,12,13) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.