ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి.. ఆపై తల్లి ఆత్మహత్యాయత్నం

తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలచిందన్న చందంగా..పిల్లలు పూర్తిగా నీటిలో మునిగిపోయి తల్లి ఒడి నుంచి మృత్యు ఒడికి చేరగా..;

Update: 2022-03-05 09:44 GMT
ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి.. ఆపై తల్లి ఆత్మహత్యాయత్నం
  • whatsapp icon

కర్నూలు : ఏం కష్టమొచ్చిందో ఏమో ఆ తల్లికి. తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి.. ఆపై తానూ దూకేసింది. తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలచిందన్న చందంగా..పిల్లలు పూర్తిగా నీటిలో మునిగిపోయి తల్లి ఒడి నుంచి మృత్యు ఒడికి చేరగా.. తల్లి మాత్రం ప్రాణాలతో బయటపడింది. అప్పటి వరకూ ముద్దు ముద్దు మాటలతో.. ఇల్లంతా సందడి చేసిన చిన్నారులు ఇంటి ముందు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ హృదయవిదారక ఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది. కర్నూల్ రూరల్ మండలం పూలతోట గ్రామంలో ఇద్దరు చిన్నారులను బావిలోకి తోసేసి కడతేర్చింది. ఆపై తానూ ఆత్మహత్యాయత్నం చేయగా.. ప్రాణాలతో బయటపడింది.

కుటుంబ కలహాలో ? భార్య - భర్తల మధ్య గొడవలో? ఆర్థిక ఇబ్బందులో ? సమస్య ఏదైనా పిల్లలు ఏం పాపం చేశారని ఇలా కడతేర్చావంటూ.. బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్న పిల్లలను చంపడానికి నీకు మనసెలా వచ్చింది. ఎంత ఘోరం చేశావమ్మా? అంటూ భోరున విలపిస్తున్నారు. ఆడుకుని అలసిపోయి పడుకోవాల్సిన పిల్లలు.. శాశ్వతంగా నిద్రపోయారన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటన స్థానికులను సైతం కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Tags:    

Similar News