ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అటాక్ మొదలుపెట్టారు. అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు, గంజాయి, అప్పుల్లో రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ గా నిలిపిన ఘనుడు జగన్ అని.. జగన్ పాలనలో రాష్ట్రం 50 ఏళ్ల వెనక్కి వెళ్లిందని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు ఎందుకు చెల్లించడం లేదని కోర్టు అడిగితే... తన తండ్రి కూడా ఉపాధ్యాయుడేనని, తన చిన్న తనంలో ఆయనకు కూడా మూడు నెలలు జీతాలు రాలేదని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి చెప్పారని అన్నారు. ఆయన చిన్నతనం అంటే 50 ఏళ్ల కిందటే కదా అని అన్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్రం 50 ఏళ్ల వెనక్కి వెళ్లినట్టే కదా అని ఎద్దేవా చేశారు. జీతాలు ఇవ్వలేని దారుణ పరిస్థితిని కూడా మంత్రి బొత్స సమర్థించుకోవడం సిగ్గుచేటని అన్నారు.
రైతుల రుణ భారంలో భారతదేశంలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రతి రైతు కుటుంబంపై తలసరి రుణ భారం రూ. 2,45,554 అప్పు ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాజ్యసభలో వెల్లడించారు. జాతీయ స్థాయిలో తలసరి అప్పు రూ. 74,121 ఉందని చెప్పుకొచ్చారు. రూ. 1,52,113 తలసరి అప్పుతో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని వెల్లడించారు. తలసరి రుణ భారం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ, కేరళ, పంజాబ్ ఉన్నాయి.