ఇప్పుడూ చెబుతున్నా.. విశాఖలో నాకు ఒకే ఫ్లాట్ ఉంది

విశాఖకు పరిపాలన రాజధాని రాకూడదని కొందరు కుట్రలు చేస్తున్నారన్నారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.

Update: 2022-10-11 06:53 GMT

ఒక సామాజికవర్గం నేతను ఏపీకి శాశ్వత ముఖ్యమంత్రిగా పనిచేయడానికి ఒక వర్గం మీడియా పనిచేస్తుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని రాకూడదని కొందరు కుట్రలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఆయన అనుకూల మీడియా విషం చిమ్ముతుందని ఆయన అన్నారు. విశాఖలో భూముల కుంభకోణం అంటూ పతాక శీర్షికల్లో ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ కుల పత్రికలు, కుల ఛానల్స్ దిగజారుడుతనాన్ని వ్యవహరిస్తున్నాయన్నారు. వికేంద్రీకరణపై దుష్ప్రచారం చేస్తున్నాయని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తనకు విశాఖపట్నంలో ఒకే ఒక ఫ్లాట్ ఉందని, అంతకు మించి తనకు ఆస్తులు లేవని ఆయన తెలిపారు. సీతమ్మధారలో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ మాత్రమే ఉందని ఆయన తెలిపారు. విశాఖలో తాను భూములు కొనుగోలు చేస్తానని నిరూపించగలరా? అని ప్రశ్నించారు. సీబీఐ విచారణకు కూడా సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. 

అల్లుడి ఆస్తులు నావి ఎలా అవుతాయి?
తన అల్లుడికి చెందిన ఆస్తులు తనవి ఎలా అవుతాయని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే కుట్రలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. దసపల్లా భూముల విషయంలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. సుప్రీంకోర్టు కూడా ఈ భూములు ప్రయివేటు వ్యక్తులకు చెందినవేనని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలనే ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ప్రభుత్వం చర్యలతో 400 కుటుంబాలు లబ్ది పొందాయని అన్నారు. అక్కడ ఇళ్లు కట్టుకుని ఉన్నవారికి ప్రయోజనం చేకూరిందని తెలిపారు. 64 మంది ప్లాట్ల ఓనర్లలో 54 మంది ఒక సామాజికవర్గానికి చెందిన వారని, చంద్రబాబు బంధువులేనని విజయసాయిరెడ్డి తెలిపారు. ఉత్తరాంధ్రలో కాపులు, యాదవ, వెలమలు ఎక్కువగా ఉన్నారని, కానీ బడా బాబులంతా చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారేనని ఆయన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే కార్యక్రమం చేపడుతున్నారన్నారు.


Tags:    

Similar News