కేసులను ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పాలి: బాలయ్య
టీడీపీ అధినేత చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసులు పెట్టారని
టీడీపీ అధినేత చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసులు పెట్టారని టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై పెట్టిన కేసులపై పోరాటాన్ని ఆపేది లేదని.. ఇలాంటి కేసులను గతంలో ఎన్నో చూశామని అన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుని, ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. ఈ పథకం ద్వారా ఎంతో మంది యువత శిక్షణ పొందారని, ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. మందబలంతో విర్రవీగుతున్నవారికి ప్రజలే బుద్ధి చెపుతారని అన్నారు. నియంత మాదిరి జగన్ పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బాలకృష్ణ.
ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి టీడీపీ సభ్యులందరినీ సస్పెండ్ చేశాక.. మీడియాతో మాట్లాడుతూ బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ తెలిపారు. టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, బుచ్యయ్యచౌదరి, గద్దె రామ్మోహన్, చినరాజప్ప సహా టీడీపీ ఎమ్మెల్యేలందరినీ ఒక్కరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై కూడా ఒక్కరోజు సస్పెన్షన్ వేటు వేశారు.