ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ.. శాంతి, భద్రతలను కాపాడటంలో పోలీసులు విఫలం !

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విచ్ఛిన్నమయిందని, శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని చంద్రబాబు డీజీపీకి..

Update: 2022-05-02 07:57 GMT

అమరావతి : ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి మాజీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో గడిచిన నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు, క్రైం రేటు వివరాలను పేర్కొంటూ డీజీపీకి లేఖ పంపారు. ఆ లేఖలో రాష్ట్రంలో జరుగుతున్న నేరాలను అదుపుచేయడంలో పోలీసులు విఫలమయ్యారని పేర్కొంటూ.. ఇటీవల జరిగిన నేరాలకు సంబంధించిన మీడియా కథనాలు, ఇతర వీడియోలను లేఖకు జతచేశారు.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విచ్ఛిన్నమయిందని, శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖలో ఆరోపించారు. జంగిల్ రాజ్ పాలనలో ప్రజలకు భద్రత కరువైందన్న చంద్రబాబు.. పేట్రేగుతున్న వైసిపి గూండాలను అదుపు చెయ్యడంలో పోలీసు శాఖ విఫలం అవుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇటీవల ఏలూరు జిల్లా జి కొత్తపల్లిలో జరిగిన వైసిపి ప్రెసిడెంట్ గంజి ప్రసాద్ హత్యకు కారణం.. ఎమ్మెల్యే తలారి వెంకట్ రావు అని స్వయంగా మృతుని భార్య ఆరోపించిన విషయాన్ని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.
అలాగే.. శ్రీకాళ హస్తిలో పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ వెయ్యడానికి వెళుతున్న వారిపై దాడిని నివారించడంలో పోలీసుల విఫలమయ్యారని తెలిపారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండి ఉంటే.. బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్లో మహిళపై దారుణం జరిగేది కాదన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో జరుగుతున్న హింసకు, వరుస నేరాలకు విచ్చలవిడి మద్యం, గంజాయి వాడకం కారణం అవుతున్నాయి. గంజాయి సరఫరాలో వైసిపి నేతల ప్రమేయం కనిపిస్తున్నా.. పోలీసు శాఖ చోద్యం చూస్తోందని దుయ్యబట్టారు.
అనంతపురంలో పెన్షన్ అడిగిన పాపానికి పోలీసు అధికారి టిడిపి కార్యకర్తపై దాడి చెయ్యడం డిపార్ట్మెంట్ లో పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పట్టపగలు గన్ తో బెదిరించి అనకాపల్లి జిల్లా కసింకోటలో బ్యాంక్ దోపిడీ జరిగింది. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఏపీ పోలీసులు స్పందించకపోవడంతో.. కర్నాటక పోలీసులు వైసిపి ఎంపిటిసిని అరెస్టు చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. తాజాగా ఏపీ నుంచి ఆస్ట్రేలియాకు డగ్స్ వెళ్లిన కేసులో దర్యాప్తు సంస్థలు ఒకరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నాయని.. అసలు నిందితుడిని ఇంకా పట్టుకోలేదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇన్ని నేరాలు జరుగుతుంటే పోలీసు శాఖ ఏం చేస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు. ఆయా నేరాల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు.. లా అండ్ ఆర్డర్ అమలు చేయడంపై పోలీసుశాఖ దృష్టిపెట్టాలని చంద్రబాబు డీజీపీ రాజేంద్రనాథ్ ను కోరారు.


Tags:    

Similar News