బాబు వచ్చి ఉంటే కరెంట్ ఛార్జీలు తగ్గేవి
సీఎం జగన్ అనుభవ లేమి, తప్పుడు నిర్ణయాలతోనే విద్యుత్తు ఛార్జీల భారం ప్రజలపై పడుతుందని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు
ముఖ్యమంత్రి జగన్ అనుభవ లేమి, తప్పుడు నిర్ణయాలతోనే విద్యుత్తు ఛార్జీల భారం ప్రజలపై పడుతుందని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. సౌర విద్యుత్తు పీపీఏలను కొనసాగించి ఉంటే ఇంతటి భారం ప్రజలపై పడి ఉండేది కాదన్నారు. పెంచిన విద్యుత్తు ఛార్జీలు ప్రభుత్వం ఉపసంహరించుకునేంత వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈరోజు ఆయన టీడీపీ శ్రేణులతో కలసి లాంతర్లు పట్టుకుని నిరసన తెలిపారు.
నిరసన ర్యాలీ....
అంథకార ప్రదేశ్ పేరిట ఆయన లాంతర్లతో ప్రదర్శనగా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. శ్లాబులను సృష్టించి పేదలపైనే జగన్ రెడ్డి భారం మోపారన్నారు. ధనవంతులకు మాత్రం పెద్దగా భారం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో విద్యుత్తు ఛార్జీలు పెంచలేదని, మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్తు ఛార్జీలు తగ్గించి ఉండేవారని లోకేష్ అన్నారు. బహిరంగ మార్కెట్ లో విద్యుత్తు కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని, త్వరలోనే వాటిని బయటపెడతామని లోకేష్ హెచ్చరించారు.