గంజాయి దందాపై గవర్నర్ కు లోకేష్ ఫిర్యాదు
తద్వారా ఏపీ డ్రగ్స్ సరఫరాకు కేంద్రంగా మారుతోందని లోకేష్ గవర్నర్ కు వివరించారు. అలాగే హవాలా లావాదేవీలు..
ఏపీలో గంజాయి అక్రమ రవాణా, గంజాయి లభ్యతపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫిర్యాదు చేశారు. శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన లోకేష్.. డ్రగ్స్ సరఫరాలో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెలియజేస్తున్న డీఆర్ఐ నివేదికను ఆయనకు అందజేశారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా.. వాటి మూలాలు ఏపీకి ముడిపడి ఉంటున్నాయని, తద్వారా ఏపీ డ్రగ్స్ సరఫరాకు కేంద్రంగా మారుతోందని లోకేష్ గవర్నర్ కు వివరించారు. అలాగే హవాలా లావాదేవీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని గవర్నర్ కు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిపై సమగ్ర విచారణ జరిపించి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ గవర్నర్ ను కోరారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లోకేష్.. రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ సరఫరా వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. డ్రగ్స్ ఉత్పత్తి, స్మగ్లింగ్ లో పట్టుబడిన వారిలో ఎక్కువశాతం వైసీపీకి చెందినవారే ఉన్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో.. యువత గంజాయి మత్తులో ఎన్నో దారుణాలకు పాల్పడిందని, విద్యార్థులపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన చెందారు. గవర్నర్ ను కలిసిన అనంతరం లోకేష్ యువగళం పాదయాత్రను కొనసాగించారు.