లోకేష్ ను చంద్రబాబే జైలుకు పంపుతారట

మా పిన్ని చనిపోతే నాపై చాలా ఘోర‌మైన ఆరోప‌ణ‌లు చేసింది వైసీపీ. నా త‌ల్లి, భార్య‌, కొడుకు దేవాన్ష్ ను

Update: 2023-08-05 03:25 GMT

నేను త‌ప్పుచేస్తే నా తండ్రే న‌న్ను జైలుకి పంపుతాడని.. జ‌గ‌న్ తండ్రిలా కాపాడ‌డని నారా లోకేష్ అన్నారు. మేము ఆధారాల‌తో స‌హా జ‌గ‌న్ అవినీతిపై ఆరోప‌ణ‌లు చేశామని.. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో సాక్ష్యాలు, ఆధారాల‌తో వైసీపీ నేత‌లు, ఎమ్మెల్యేల బండారం బ‌య‌ట‌పెడుతున్నానన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్లపై మంగ‌ళ‌గిరి అడిషిన‌ల్‌ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో లోకేశ్ క్రిమిన‌ల్ కేసులు దాఖలు చేశారు. ఈ కేసులకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట లోకేశ్ శుక్ర‌వారం నాడు వాంగ్మూలం ఇచ్చారు. అనంత‌రం మంగ‌ళ‌గిరి టీడీపీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జ‌గ‌న్ లా నేను అవినీతి చేయ‌లేదు. నీతిగా, చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తున్నాను. మాపై వంద‌ల ఆరోప‌ణ‌లు చేసి నిరూపించ‌లేక‌పోయారు. పింక్ డైమండ్ మాయం, టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో 6 ల‌క్ష‌ల కోట్ల అవినీతి, అమ‌రావతి ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్, ఫైబ‌ర్ నెట్, స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ స్కాం అంటూ వైసీపీ అనేక ఆరోపణలు చేసింది. వీటిలో ఏ ఒక్క‌దానిలో ఒక్క ఆధార‌మూ బ‌య‌ట‌పెట్ట‌లేదు. ఒక్క కేసూ నిరూపించ‌లేదన్నారు.

మా పిన్ని చనిపోతే నాపై చాలా ఘోర‌మైన ఆరోప‌ణ‌లు చేసింది వైసీపీ. నా త‌ల్లి, భార్య‌, కొడుకు దేవాన్ష్ ను కూడా ట్రోల్ చేస్తున్నారు. నేను మంత్రిగా ఉన్న‌ప్పుడు ఐటీ ఇన్సెంటివ్‌లు ఇచ్చాన‌ని ఆరోపించారు. విశాఖ ఎయిర్ పోర్టులో రూ.25 ల‌క్ష‌ల స్నాక్స్ తిన్నాన‌ని త‌ప్పుడు రాత‌లు రాయించారు. నాడు ఎన్టీఆర్ నుంచి నేడు నా వరకు మా కుటుంబంపై చేసిన ఏ ఆరోప‌ణా నిరూపించ‌లేకపోయారు. ఇదీ మా నీతి-నిజాయతీకి నిద‌ర్శ‌నం. భార‌త‌దేశంలోనే ప్ర‌తి ఏటా ఆస్తులు ప్ర‌క‌టించే ఏకైక కుటుంబం మాదని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. జ‌గ‌న్ లా తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని దోచుకోలేదు. ఉద‌యం ఏదైనా కంపెనీకి భూమి ఇస్తే సాయంత్రం జ‌గ‌న్ లా కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టించ‌లేదు. త‌ప్పులు చేసిన జ‌గ‌న్ లా 16 నెల‌లు జైలుకెళ్ల‌లేదు. జ‌గ‌న్ ది జైలు లైఫ్‌... నాది కాలేజీ లైఫ్‌. జగ‌న్‌కి జైలు మేట్స్ ఉంటే నాకు క్లాస్ మేట్స్ ఉన్నారంటూ విమర్శలు గుప్పించారు. నా కుటుంబంపై, తెలుగుదేశం పార్టీపై విష‌ప్ర‌చారం చేశారు. నా వ్యక్తిత్వంపై బురద చల్లేందుకు అన్ని మార్గాల్లోనూ తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. త‌ప్పులు చేయ‌ను, త‌ప్పుడు ప్ర‌చారం చేసే ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌నని అన్నారు నారా లోకేష్. అందుకే, త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన‌, క‌ట్టుక‌థ‌లు రాసిన వారంద‌రిపైనా వరుసగా పరువున‌ష్టం దావాలు వేస్తున్నాను. ఇప్ప‌టివ‌ర‌కూ సివిల్, క్రిమిన‌ల్ క‌లిపి 8 కేసులు వేశాను. ఇంకా వేస్తూనే ఉంటానని అన్నారు. చ‌ట్టాన్ని ఉల్లంఘించి మ‌రీ టీడీపీ కేడ‌ర్‌ని ఇబ్బంది పెడుతున్న అధికారులు, మీడియా సంస్థ‌ల‌పైనా న్యాయ‌పోరాటం కొన‌సాగుతుందని తెలిపారు. త‌ప్పుడు వార్త‌లు రాయాల‌న్నా, అవాస్త‌వ ప్ర‌చారం చేయాల‌న్నా ఒక్కొక్క‌డూ భ‌య‌ప‌డేలా చేస్తానని హెచ్చరించారు.


Tags:    

Similar News