Andhra Pradesh : అమ్మో ఒకటో తారీఖు... కొత్త ప్రభుత్వానికి ఒకటోతేదీ వస్తుందంటే హార్ట్ బీట్ పెరుగుతుందిగా
ఆంధప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఒకటో తేదీ భయం పట్టుకుంది. ఒకటోతేదీ వస్తుందంటే పదివేల కోట్లు అవసరమవుతాయి
ఆంధప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఒకటో తేదీ భయం పట్టుకుంది. ఒకటోతేదీ వస్తుందంటే పదివేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. కొత్తగా ఏర్పాటయిన ప్రభుత్వానికి నిధుల సమీకరణ సవాల్ గా మారింది. ఇచ్చిన హామీల మేరకు ఒకటో తేదీన వాటిని అమలు చేయాల్సి రావడంతో నిధులను ఎలాగైనా తీసుకు రావాల్సిన బాధ్యత ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జులై నెల వస్తుంది. నూతనంగా ఏర్పాటయిన ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
పింఛన్లు చెల్లించాలంటే...
ఇంకా పూర్తిగా కుదరుకోలేదు. అప్పుడే జులై నెల వస్తుంది. కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగా జులై నెల నుంచి పింఛన్లు ఒకటో తేదీన ఇంటికే చేరవేస్తామని చెప్పారు. ఇంటికి చేరవేయడంలో పెద్దగా ఇబ్బందులుండవు. కానీ ఒక్కొక్క పింఛను దారుడికి ఏడువేల రూపాయలు చెల్లించాలి. ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి వెయ్యి రూపాయలు, జులై నెల నాలుగు వేలు కలపి ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం 65 లక్షల మంది పింఛను దారులకు ఏడు వేల రూపాయల చొప్పున పింఛను మొత్తాన్ని జులై నెల ఒకటో తేదీన చెల్లించాలి. ఇందుకు 4,408 కోట్ల రూపాయలు అవసరమవుతాయి.
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు...
దీంతో పాటు ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను ప్రతి నెల ఒకటోతేదీ ఠంచనుగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ పెన్షనర్లకు కూడా ఒకటో తేదీన ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు పింఛను చెల్లించాలంటే 5,500 కోట్లు అవసరమవుతాయి. అంటే మొత్తం పదివేల కోట్ల రూపాయలు ఒక్క జులై ఒకటోతేదీన ఏపీ ప్రభుత్వం సమీకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తొలి నెల ఫెయిల్ కాకూడదని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న ప్రయత్నంలో పాలకులున్నారు. ప్రభుత్వ అధికారులు నిధుల సమీకరణలో ఉన్నారు. మరి ఇంకా కేవలం పదకొండు రోజులు మాత్రమే జులై ఒకటో తేదీకి సమయం ఉండటంతో అధికార వర్గాల్లో టెన్షన్ మొదలయింది.