Andhra Pradesh : ఆరోగ్య శ్రీ ఇక లేనట్లేనా? నిధులు లేక భరించలేక.. ప్రత్యామ్నాయం వెతుకుతున్నారా?
ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ పథకానికి కొత్త ప్రభుత్వం మంగళం పాడుతున్నట్లే కనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ పథకానికి కొత్త ప్రభుత్వం మంగళం పాడుతున్నట్లే కనిపిస్తుంది. ప్రయివేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి రావడంతో ప్రభుత్వం కొత్త మార్గం ఎంచుకునే దిశలో ప్రయత్నాన్ని ప్రారంభించింది. అసలే ఖజానా ఖాళీగా ఉందని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసేది ఎలా? అని ప్రజలనే ఆయన ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయన ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే అనేక హామీలను అమలు పర్చకుండా కొంత కాలయాపన చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అనేక పధకాలు...
ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదు. అలాగే తల్లికి వందనం ఈ ఏడాది ఇక లేనట్లే. వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని నారా లోకేష్ శాసనమండలిలో ప్రకటించడంతో దానిపై కొంత క్లారిటీ వచ్చింది. ఇక మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారన్నది ఇంత వరకూ నిర్ణయించలేదు. ఇక పద్దెనిమిదేళ్లు దాటిన మహిళలకు పదిహేను వందల రూపాయల నగదును ఇచ్చే పథకాన్ని అమలుచేస్తారో? లేదో కూడా తెలియదు. యాభై ఏళ్లకే బీసీలకు పింఛను ఇస్తామన్న హామీ కూడా ఇప్పట్లో అమలు పర్చేందుకు అవకాశాలు ఎంత మాత్రం కనిపించడం లేదు.
ఖజానా ఖాళీ...
ప్రస్తుతానికి వృద్ధులకు నాలుగువేల రూపాయలు, వికలాంగులకు ఆరువేల రూపాయల పింఛను మాత్రం ఇస్తున్నారు. దీంతో పాటు ఆగస్టు 15వ తేదీ నాటికి అన్నా క్యాంటిన్లు ప్రారంభిస్తామని తెలిపారు. అంతే తప్ప మరే హామీని అమలు పర్చేందుకు కాసులు లేవన్నది అధికార వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీని అమలు చేసినా ఖజానాపై భారం పడుతుందని, అది ఇబ్బందికరంగా మారుతుందన్న ఆందోళన అధికార పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. దీంతో ప్రజలను పరిస్థితిని అర్థం చేసుకోవాలని పార్టీ నేతలు కోరుతున్నారు. సంక్షేమ పథకాలను అమలు పరిస్తే అభివృద్ధి పనులు పడకేస్తాయి. తిరిగి జగన్ ప్రభుత్వం మాదిరిగానే విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుందన్న భయం వారిలో కనిపిస్తుంది.
బీమా విధానంలోకి...
ఇప్పుడు తాజాగా ఆరోగ్య శ్రీ పథకానికి కూడా మంగళం పాడే పరిస్థితి వచ్చింది. ఆరోగ్య శ్రీ సేవలు బీమా విధానంలోకి మార్చేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ విధానం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ లక్ష్మీ నిన్న సచివాలయంలో ప్రభుత్వ, ప్రైవేట్ బీమా సంస్థల ప్రతినిధులతో సమావేశమై ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించారు. వీరి అభిప్రాయాన్ని సేకరించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో పెద్దయెత్తున బకాయీలను కార్పొరేట్ ఆసుపత్రులకు పెండింగ్ లో పెట్టారంటున్నారు. కానీ వైసీపీ మాత్రం ఆరోగ్య శ్రీని ఎత్తివేసే కుట్ర జరుగుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.