Visakha MLC : విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా? లేక తప్పుకుంటుందా?
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయింది. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాలా? వద్దా? అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయింది. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాలా? వద్దా? అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితిపై చర్చించారు. బలాబలాలను అడిగి తెలుసుకున్నారు. అర్బన్ ప్రాంతంలోనూ, రూరల్ ఏరియాలో ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయన్నది చంద్రబాబు తెలుసుకున్నారు. ఇప్పటికే వైసీపీ తమ పార్టీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఖరారు చేసింది.
బలాబలాలు...
వైసీపీకి ఈ ఎన్నికల్లో 600 ఓట్లు వరకూ ఉండగా, టీడీపీకి 250 ఓట్లు మాత్రమే ఉన్నాయి. గెలవాలంటే మరో వంద నుంచి నూట యాభై ఓట్లను తమ వైపునకు తిప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే వైసీపీ తమ ఓటర్లను క్యాంప్ లకు తరలించింది. బెంగళూరుకు ఎంపీటీసీ, సర్పంచ్ లను చేరవేసింది. కొన్ని నియోజకవర్గాల్లో సర్పంచ్ లు, ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నా వచ్చే వారి సంఖ్య గెలుపునకు దోహదం చేయదని భావిస్తున్నారు.
పోటీ చేసి...
ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన సమావేశంలో చంద్రబాబు వద్ద కొందరు నేతలు ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. పోటీ చేసి ఓటమి పాలయ్యేకంటే ఒక ఎమ్మెల్సీ కోసం పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం ఎందుకని సీనియర్ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఆ ఎమ్మెల్సీ వల్ల ఒరిగేదేమీ లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు దీనిపై నిన్న ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా దాట వేశారు. బలాబలాలను చూసిన తర్వాత ఆయన టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపుతారా? లేదా? అన్నది కూడా అనుమానంగా మారింది. ఏ విషయమూ చంద్రబాబు ఈరోజు క్లారిటీ ఇచ్చే అవకాశముంది.