BJP : ట్రాక్ రికార్డుకే రెడ్ కార్పెట్... జెండా పట్టుకున్నోళ్లకే ఛాన్స్... ఈసారి నమ్మకున్న వారికే అందలం

పార్టీలో బ్యాక్ గ్రౌండ్ బలంగా ఉన్న వారికే ఈసారి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కిందనే చెప్పాలి

Update: 2024-06-09 07:22 GMT

భారతీయ జనతా పార్టీ అంటే సహజంగా సిద్ధాంతాలను ఉండే పార్టీ అని నమ్ముతారు. మొన్నటి వరకూ అంతే. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకంటే పార్టీని నమ్ముకున్న వారికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అయితే సీట్ల విషయంలో మాత్రం రాజీ పడక తప్పలేదు. గెలుపు గుర్రాలకే ఇవ్వాల్సి రావడంతో బలహీనంగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అధికంగా టిక్కెట్లు ఇచ్చారు. అందులో కొందరికి పార్టీని నమ్ముకున్న వారికి కూడా ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రావాలంటే అత్యధిక సీట్లు గెలవడం ముఖ్యం అందుకే సీట్ల కేటాయింపులో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారని వేరుగా చూడలేదు.

ముగ్గురు నేతలకు
ఇక ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో మాత్రం బీజేపీ ముగ్గురు నమ్మకమైన నేతలకు చోటు కల్పించింది. వారి ట్రాక్ రికార్డును చూసింది. వారు పార్టీకి పడిన కష్టాన్ని పరిశీలించింది. జెండా ఎవరు పట్టుకున్నారన్నదే ప్రధానంగా తీసుకున్నట్లు కనిపిస్తుంది. కష్టకాలంలో జెండాను భుజాలపై మోసిన వారికి అన్యాయంచేయకూడదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీలో చేరిన వాళ్లు. కానీ కొన్ని దశాబ్దాలుగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రతికూల ఫలితాలు వచ్చినా జెండాను దించకుండా మోసిన వారికే ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందుకు ఆర్ఎస్ఎస్ ప్రోద్బలం కూడా తోడయ్యింది.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి నేడు నరేంద్ర మోదీతో పాటు ముగ్గురు బీజేపీ నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిసింది. అందుతున్న సమాచారం ప్రకారం కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు తెలంగాణ నుంచి ఎంపికయ్యారు. తెలంగాణలో ఎనిమిది సీట్లు గెలవడంతో ఈ ఇద్దరు కొన్ని దశాబ్దాల పాటు పార్టీ జెండాను మోసిన వారిగా గుర్తించి కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో నూ జెండా వదిలిపెట్టలేదు. పక్క చూపులు చూడలేదు. అదే వారికి ఈసారి మంత్రి పదవులు తెచ్చి పెట్టడంలో ప్లస్ పాయింట్ గా మారిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
సీటు విషయంలోనూ...
ఇక నరసాపురం పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన భూపతిరాజు శ్రీనివాసవర్మ గురించి మొన్నటి వరకూ ఎవరికీ పెద్దగా తెలియదు. ఆయన ప్రచారానికంటే పార్టీ బలోపేతానికే ఎక్కువ కష్టపడ్డారు. అందుకే ఎంత వత్తిడి వచ్చినా నరసాపురం సీటు విషయంలో తలొగ్గకుండా భూపతిరాజు శ్రీనివాసవర్మకే సీటు కేటాయించింది. కూటమి నుంచి అనేక ప్రతిపాదనలు వచ్చినా తిరస్కరించింది. చివరకు భూపతిరాజు శ్రీనివాసవర్మ విజయం సాధించారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉండటంతో భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రి పదవి వరించిందంటున్నారు. తొలిసారి గెలిచినా ఆయన పేరునే చివరకు ఖరారు చేసి భారతీయ జనతా పార్టీ ఈసారి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి.


Tags:    

Similar News