విషాదం.. కరెంట్ షాక్ తో వైసీపీ మహిళా నేత మృతి

వంటగదిలోకి వెళ్లిన భార్య ఎంతకూ బయటికి రాకపోవడంతో.. భర్త వెంకటేశ్వర్లు లోపలికెళ్లి చూశారు. రాఘవమ్మ అచేతనంగా..

Update: 2022-12-16 13:04 GMT

విధి ఆడిన వింత నాటకంలో వైసీపీ మహిళా నేత ప్రాణాలు కోల్పోయింది. నాలుగురోజుల్లో మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆమె.. కరెంట్ షాక్ తో మృతి చెందింది. పల్నాడు జిల్లాలోని శావల్యాపురం మండలం, కారుమంచి గ్రామంలో చోటుచేసుకుందీ ఘటన. కారుమంచి మాజీ సర్పంచి చుండూరి రాఘవమ్మ గురువారం (డిసెంబర్ 15) సాయంత్రం తన ఇంట్లో గ్రైండర్ లో వేసిన మినపపిండిని తీస్తున్నారు. ఇంతలో దానికి ఎర్త్ పాస్ అవడంతో ఆమె షాక్‌కు గురయ్యారు. అక్కడే కుప్పకూలిపోయారు.

వంటగదిలోకి వెళ్లిన భార్య ఎంతకూ బయటికి రాకపోవడంతో.. భర్త వెంకటేశ్వర్లు లోపలికెళ్లి చూశారు. రాఘవమ్మ అచేతనంగా పడి ఉండటంతో భయపడి చుట్టుపక్కల వారిని పిలిచారాయన. ఊరిలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడిని పిలవగా.. అప్పటికే ఆమె ప్రాణాలు విడిచిందని నిర్ధారించారు. ఆమె కుమారుడు విశ్వనాథ్‌ యూఎస్‌లో జాబ్ చేస్తున్నాడు. తల్లి మరణవార్త విని సొంతూరికి బయల్దేరాడు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, ఇతర వైసీపీ నేతలు రాఘవమ్మ మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ నెల 19న రాఘవమ్మ ఈపూరు మార్కెట్ యార్డు అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆమె హఠాన్మరణం అందరినీ కలచివేసింది. రాఘవమ్మ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



Tags:    

Similar News