5 పైసలకే బిర్యానీ
నంద్యాలలోని క్లాసిక్ రెస్టారెంట్ నిర్వాహకులు ఐదు పైసలకే బిర్యానీ అని ప్రకటించడంతో జనం క్యూ కట్టారు
కొత్త ఏడాది వస్తుందంటే అందరికీ ఉత్సాహమే. పార్టీలు చేసుకుంటూ సంతోషంగా గడపాలని భావిస్తారు. డిసెంబరు 31వ తేదీ రాత్రి అయితే ప్రభుత్వం కూడా మద్యం షాపులకు, హోటళ్లకు సమయం కూడా ఎక్కువ కేటాయిస్తుంటుంది. ఎక్కువ మంది యువత బిర్యానీ అంటే ఇష్టపడతారు. దానిని ఆసరాగా చేసుకుని నంద్యాలలో ఐదు పైసలకే బిర్యానీ అంటూ ఒక హోటల్ ప్రచారం చేసింది. ఐదు పైసలు నాణెం అనేది కన్పించకుండా పోయి చాలా కాలం అయింది. ఆ ఐదు పైసలు తెస్తే బిర్యానీ ఇస్తామని ప్రకటించారు ఒక హోటల్ నిర్వాహకులు.
నంద్యాలలోని....
నంద్యాలలోని క్లాసిక్ రెస్టారెంట్ నిర్వాహకులు ఐదు పైసలకే బిర్యానీ అని ప్రకటించడంతో జనం ఎగబడ్డారు. తమ వద్ద ఉన్న పురాతన నాణేలను వెతికి మరీ తెచ్చుకుని క్యూ కట్టారు. భారీ ఎత్తున ప్రజలు బిర్యానీ కోసం తరలి రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీ ఛార్జి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్యూలైన్ లో నిల్చున్న వారి మధ్య చిన్న చిన్న ఘర్షణలు కూడా జరిగాయి. తోపులాట జరగడంతో పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.