Pithani : పితాని పరిస్థితి ఏంటి భయ్యా... వెయిట్ చేయడం తప్ప మరో మార్గం లేదటగా?

పితాని సత్యనారాయణ అంటే తెలియని వారుండరు. సీనియర్ నేతగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సామాజికవర్గానికి బలమైన నేత.

Update: 2024-07-19 11:46 GMT

పితాని సత్యనారాయణ అంటే తెలియని వారుండరు. సీనియర్ నేతగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సామాజికవర్గానికి బలమైన నేత. ఆయన వెంటే లక్కు ఉంటుందని అందరూ భావిస్తారు. పార్టీ మారినా అధికారంలోకి రావడమే కాకుండా మంత్రి పదవి కూడా ఇంటికి వచ్చి తలుపుతడుతుందని ఆయన అనుచరులు భావిస్తారు. ఆయన ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే చాలు తమ నేతకు మంత్రి పదవి గ్యారంటీ అని విశ్వసిస్తారు ఆయన అనుచరులు. బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పితాని సత్యనారాయణకు నియోజకవర్గంలోనే కాదు జిల్లాలోనూ కీలక నేతగా పరిగణిస్తారు.

ఏ పార్టీలో చేరినా...
పితాని సత్యనారాయణ కు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి దక్కింది. ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చినా చంద్రబాబు పితానికి ఆలస్యంగానైనా మంత్రి పదవి ఇచ్చారు. బలమైన శెట్టి బలిజ సామాజిక వర్గం కావడం, ఆయన సామాజిక వర్గం ఐదారు శాసనసభ నియోజకవర్గాల్లో బలంగా ఉండటంతో ప్రతి పార్టీ ఆయన కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటుంది. పెనుగొండ, ఆచంట నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రి పదవిని దక్కించుకున్నారు. శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన పితాని సత్యనారాయణ కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఒక వెలుగు వెలిగారు. ఆయన తొలుత వైసీపీలో చేరాలనుకుని 2014లో ఆయన టీడీపీలో చేరి తిరిగి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో జగన్ హవా ముందు ఆయన ఓటమి పాలయ్యారు.
ఓటమి పాలయినా...
అయితే 2019 ఎన్నికల్లో ఆచంట నుంచి పోటీ చేసిన పితాని సత్యనారాయణ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఐదేళ్ల పాటు పార్టీలోనే ఉంటూ జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రయత్నించారు. పితాని, ఆయన కుమారుడిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఆయన నాడు పార్టీ మారతారన్న ప్రచారం జరిగినా తాను టీడీపీలోనే కొనసాగుతానని చెప్పి పితాని సత్యనారాయణ సైకిల్ పార్టీకి దన్నుగా నిలిచారు. అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి గ్యారంటీ అని భావించారు. శెట్టి బలిజ సామాజికవర్గంలో తనను మించిన నేత లేరని ఆయన భావించారు. తనను కాదని మంత్రి పదవి ఎక్కడకు పోతుందన్న ధీమాలో ఉన్నారు.
గ్యారంటీ అనుకుంటే...?
కానీ 2024లో ఆచంట నియోజకవర్గం నుంచి పితాని సత్యనారాయణ గెలిచారు. ఇటు కూటమి కూడా అధికారంలోకి వచ్చింది. కానీ మంత్రి పదవి మాత్రం దక్కలేదు. సీనియర్ నేతలను అందరినీ పక్కన పెట్టిన నేపథ్యంలో పితాని సత్యనారాయణను కూడా టీడీపీ అధినేత తన కేబినెట్ లో చోటు కల్పించలేదు. ఫలితంగా ఆయన తీవ్ర నిరాశకు గురయినట్లు తెలిసింది. గత కొద్ది రోజులుగా నియోజకవర్గానికే పరిమితమైన పితాని సత్యనారాయణ విజయవాడకు ముఖ్యమైన సమావేశాలకు కూడా రాలేదని చెబుతున్నారు. తాను మంత్రి పదవి ఊహించుకుంటే తనను సీనియర్ పేరిట సాకుగా చూపి యువకుడైన అదే సామాజికవర్గానికి చెందిన వాసంశెట్టి సుభాష్ కు ఇవ్వడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. వెయిట్ చేయడం తప్ప. అంటూ ఆయన అనుచరులు నిట్టూరుస్తున్నారు.


Tags:    

Similar News