మహా పాదయాత్రకు అనుమతి నిరాకరణ
రాజధాని అమరావతి రైతుల పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
రాజధాని అమరావతి రైతుల పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అమరావతి నుంచి అరసవల్లి వరకూ ఈ నెల 12వ తేదీన రైతులు మహా పాదయాత్ర తలపెట్టారు. దీనికి పోలీసులు అనుమతి కోరారు. అయితే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మహాపాదయాత్రకు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని కారణం చూపిన పోలీసులు అనుమతిని నిరాకరించారు.
గతంలోనూ షరతులు ఉల్లంఘించి...
గతంలోనూ కోర్టు విధించిన షరతులు ఉల్లంఘించారని, జిల్లాల పోలీసు అధికారుల అభిప్రాయాన్ని కోరగా వారు శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశముందని చెప్పారని తిరస్కరిస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 200 మందికి పైగా పాదయాత్రలో పాల్గొంటారని చెప్పినా అంతకు మించి పాల్గొనడం కోర్టు షరతులను ఉల్లంఘించడమేనని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై గత పాదయాత్ర లో దాడులు చేశారన్నారు. ప్రస్తుతం తలపెట్టిన పాదయాత్ర కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నం మీదగా కూడా పాదయాత్ర జరుగుతుందని, అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశమున్నందున మహా పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.