నడుచుకుంటూనే ఇప్పటం గ్రామానికి వెళ్లిన పవన్..ఏమీ చేయలేకపోయిన పోలీసులు
ఈ ఘటనపై జనసేనాని స్పందించారు. కూల్చివేతల ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందన్నారు పవన్. నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం..
ఏపీలో రాజకీయాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. అధికార.. ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అనేలా మాటలయుద్ధాలు చేసుకుంటున్నాయి. విశాఖ టూర్ తర్వాత పోలీసులు పవన్ ను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు భూములిచ్చిన ఇప్పటం గ్రామంలో.. ఎప్పుడూ లేనంతగా భారీస్థాయిలో రోడ్డు వేసేందుకు అక్కడున్న ఇళ్లను కూల్చివేశారు అధికారులు. తమగ్రామానికి బస్సు కూడా రాదని.. అలాంటిది ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ రోడ్డు పనులు చూపించి.. తమను నిరాశ్రయులను చేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకన్నా ముందు ఉన్న ఊరిలో రోడ్డువేయకుండా తమ ఊరిలో మాత్రమే పెద్దరోడ్డు వేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ ఘటనపై జనసేనాని స్పందించారు. కూల్చివేతల ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందన్నారు పవన్. నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతల్ని నిరసిస్తూ ఇవాళ అక్కడ పర్యటించేందుకు పవన్ సిద్ధమయ్యారు. రాత్రి మంగళగిరి జనసేన కార్యాలయానికి చేరుకున్న పవన్.. ఈరోజు ఉదయం ఇప్పటం గ్రామానికి వెళ్లేందుకు బయల్దేరగా కార్యాలయం వద్దే పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్దితులు తలెత్తాయి. విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు భారీగా తరలిరావడంతో.. వారిని నియంత్రించేందుకు పోలీసులు ఆపసోపాలు పడ్డారు.
పవన్ కల్యాణ్ వాహనాలను అక్కడే వదిలి నడుచుకుంటూనే మంగళగిరి నుండి కార్యకర్తలతో ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. జనసేన కార్యకర్తలతో కలిసి నిన్న అధికారులు కూల్చేసిన ఇళ్లను పరిశీలిస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో అధికారులు పలు ఇళ్లను కూల్చేశారు. దీనిపై జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్ పై అత్యవసర విచారణ జరిపిన హైకోర్టు.. కూల్చివేతలు ఆపాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా.. ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చిన గ్రామస్తులకు పవన్ రూ.50 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం సీఆర్డీయేకు ఇవ్వాలని అధికారులు పట్టుబట్టారు. దీనికి గ్రామస్తులు, జనసేన కూడా ఒప్పుకోలేదు. అందుకే కూల్చివేతల పర్వానికి తెరతీశారంటూ స్థానికులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.