Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఉప ఎన్నిక తప్పదా?
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీని వీడేందుకు మరికొందరు నేతలు సిద్ధమవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీని వీడేందుకు మరికొందరు నేతలు సిద్ధమవుతున్నారు. అందులో రాజ్యసభ సభ్యుడు ఒకరు ఉన్నారని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో భాగస్వామి కావడానికి వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. అయితే జగన్ కు అత్యంత నమ్మకంగా ఉన్నవాళ్లే పార్టీని వదిలివెళతారన్న ప్రచారంతో పార్టీలో కలకలం రేగుతుంది. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాజ్యసభ పదవికి రాజీనామా చేయాలని షరతు విధించారు. ఆయన ఇటీవల హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలుసుకుని మంతనాలు జరిపినట్లు నియోజకవర్గంలో క్యాంపెయిన్ నడుస్తుంది.
అత్యంత సన్నిహితుడిగా...
ఆయన ఎవరో కాదు.. జగన్ కు అత్యంత నమ్మకస్థుడైన మోపిదేవి వెంకటరమణ. గత ఎన్నికల్లో తన కుటుంబానికి టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. జగన్ కు తొలి నుంచి సన్నిహితుడిగా మోపిదేవి వెంకటరమణకు పేరుంది. ఆయన 2019 ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేసి ఓటమి పాలయినప్పటికీ జగన్ ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. అయితే శాసనమండలి రద్దు ప్రకటనతో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ల చేత మంత్రి పదవులకు రాజీనామా చేయించారు. వారికి రాజ్యసభ పదవి ఇచ్చారు. తర్వాత శాసనమండలి రద్దు నిర్ణయం వెనక్కు తీసుకున్నారు.
టిక్కెట్ దక్కక...
గత ఎన్నికల్లో తన సోదరుడుకు టిక్కెట్ ఇవ్వాలని మోపిదేవి వెంకటరమణ పట్టుబట్టినా ఇవ్వకుండా ఈవూరి గణేష్ కు టిక్కెట్ ఇచ్చారు. అప్పటి నుంచి మోపిదేవి కొంత అసహనంతో ఉన్నారు. దీనికి తోడు పార్టీ అధికారం కోల్పోవడంతో ఆయన పార్టీ మారేందుకు డిసైడ్ అయినట్లు తెలిసింది. రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని క్యాడర్ తో జరిగే సమావేశంలో తాను పార్టీకి రాజీనామా చేసే విషయాన్ని వెల్లడించనున్నారు. అయితే పార్టీలో చేరాలంటే రాజ్యసభ పదవికి రాజీనామా చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు షరతు విధించినట్లు తెలిసింది. అందుకు బదులుగా ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తుంది.
ఒక్క సభ్యుడు కూడా....
టీడీపీకి రాజ్యసభలో ఒక్క సభ్యుడు కూడా లేరు. దీంతో వైసీపీ రాజ్యసభ సభ్యులకు టీడీపీ గాలం వేస్తున్నట్లు కనపడుతుంది. శాసనసభలో బలాబాలాలను చూసుకుంటే వైసీపీకి ఒక్క స్థానమూ దక్కదు. అన్ని కూటమి పార్టీలకే చెందుతాయి. అందుకే వైసీపీకి చెందిన ఇద్దరు ముగ్గురు రాజ్యసభ సభ్యులతో టచ్ లోకి టీడీపీ నేతలు వెళుతున్నట్లు సమాచారం. టీడీపీకి పెద్దల సభలో భాగస్వామ్యం లేకపోవడంతో వీలయినంత త్వరగా రాజ్యసభలో కనీసం ఇద్దరు ముగ్గురు సభ్యులతోనైనా ఉండేలా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. మరి మోపిదేవితో పాటు మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఎవరన్న చర్చ కూడా ఇప్పడు రాజకీయంగా జరుగుతుంది. అదే జరిగితే వైసీపీకి భారీ డ్యామేజీ జరిగినట్లే.