Prathipati Sharath:హై డ్రామా.. ఆ జైలుకు ప్రత్తిపాటి శరత్
టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ అరెస్ట్ చేశారు.
Prathipati Sharath:టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి శరత్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం క్రీస్తు రాజపురంలోని ఒకటవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి కరీముల్లా నివాసానికి వెళ్లి ఆయన ముందు శరత్‌ను పోలీసులు హాజరుపరిచారు. శరత్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. డీఆర్ఐ అధికారుల ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు శరత్‌పై కేసు నమోదు చేశారు. ప్రత్తిపాటి శరత్ సహా ఏడుగురిపై కేసు నమోదయింది. అందులో ఆయన భార్య, బావమరిది కూడా ఉన్నట్టు సమాచారం. నిధులు మళ్లించి పన్ను ఎగవేశారన్నది ప్రధాన ఆరోపణ. శరత్‌పై ఐపీసీ 420, 409, 467, 471, 477(ఏ), 120బి రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
శరత్ అరెస్ట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఎన్నికల వేళ జగన్ కక్ష సాధింపు చర్యలు తీవ్రమయ్యాయని ఆరోపించారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులను వేధిస్తున్నారని.. ఇందులో భాగమే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అక్రమ అరెస్టు అని చంద్రబాబు అన్నారు. శరత్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీఎస్డీఆర్ఐ ద్వారా అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ నేతలను వేధించడానికి సీఐడీని తన జేబు సంస్థగా మార్చుకున్నట్టే... ఇప్పుడు ఏపీఎస్డీఆర్ఐ ద్వారా కూడా రాజకీయ కక్షలను తీర్చుకుంటోందని విమర్శించారు. ఎన్నికల ముంగిట పార్టీ అభ్యర్థులను బలహీన పరిచేందుకే ఈ కుట్రలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 రోజుల్లో ఇంటికి పోయే వైసీపీ ప్రభుత్వానికి అనుబంధ విభాగం సభ్యులుగా పనిచేసే అధికారులు మూల్యం చెల్లించక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.