పిన్నెల్లికి నిరాశ.. మహిళా నాయకురాలు ఆత్మహత్యాయత్నం
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టడంపై
మాచర్ల : ఏపీ కొత్త మంత్రి వర్గం తుది జాబితా కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఈ జాబితాలో 10 మంది పాతమంత్రులు, 15 మంది కొత్త మంత్రులకు స్థానం దక్కింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన సీఎం జగన్.. కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ వర్గాలను పట్టించుకోలేదంటూ విమర్శలు వస్తున్నాయి. పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నవారిని పక్కనపెట్టి.. కొత్తవారికి మంత్రి పదవులు ఇవ్వడంపై అసంతృప్తి మొదలైంది.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టడంపై ఆయన అనుచరుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆయన ప్రభుత్వంపై అలిగి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిన విషయం తెలిసిందే. పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వకపోడానికి నిరసనగా.. మండల కేంద్రమైన రెంటచింతలలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. మాచర్ల నియోజకవర్గం మహిళ నాయకురాలు పాముల సంపూర్ణమ్మ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు.