పురంధేశ్వరి చుట్టూ ఏపీ రాజకీయాలు.. ఎందుకో తెలుసా?
ఇప్పుడు ఏపీ రాజకీయాలు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చుట్టూ తిరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పురందేశ్వరి..
ఇప్పుడు ఏపీ రాజకీయాలు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చుట్టూ తిరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పురందేశ్వరి ని తెలుగుదేశం పార్టీ నేతగా వైసీపీ నాయకులు అభివర్ణిస్తున్నారు. అయితే పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికీ సుజనాచౌదరి, సీఎం రమేష్ వంటి ఒకప్పటి టీడీపీ నేతలు బీజేపీలో చేరినా.. చంద్రబాబు తో నిత్యం టచ్ లోనే ఉన్నారనేది వైసీపీ నేతల ఆరోపణ. దీనికి తోడు పురంధేశ్వరి కూడా చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక పురంధేశ్వరి కూడా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇసుక తవ్వకాలు, కేంద్ర ప్రభుత్వ నిధులు దారి మళ్లాయని, సర్పంచ్‌ల సమస్యలపై, ఏదొక అంశంపై పురందేశ్వరి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.
ఇటీవల మద్యం అమ్మకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పాలన చూడకుండా తనకు పేరు రావడం కోసం ఏదొక ఆరోపణ చేస్తున్నారని పురంధేశ్వరి పై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పురంధేశ్వరి పేరుకే బీజేపీ అధ్యక్షురాలు అని, ఆమె టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేయడం తో రెండు పార్టీల మధ్య వివాదం మరింతగా రాజుకుంది. సజ్జల వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే నారా లోకేష్‌తో కలిసి పురందేశ్వరి కేంద్ర మంత్రి అమిత్ షాను కలవడం మరింత చర్చకు దారితీసింది.