Raghu Rama Krishna Raju : రాజుగారు అనుకున్నది సాధించారుగా.. ఇక తడాఖా చూపుతారా?

రఘరామ కృష్ణరాజు అంటేనే ఒక ఫైర్. ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే.. ఆయనకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు

Update: 2024-12-07 08:28 GMT

రఘరామ కృష్ణరాజు అంటేనే ఒక ఫైర్. ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే.. ఆయనకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. రాజుగారి దర్పం ఎలాగోనో ఆయన కూడా తనకు కావాల్సింది డబ్బులు కాదు. గౌరవం.. ఐడెంటిటీ. గౌరవం, ఐడెంటిటీ దక్కితే చాలు ఆయనకు అంతకు మించింది మరేదీ అక్కరలేదు. ఏ పార్టీలో ఉన్నా సరే రఘరామ కృష్ణరాజు ముందు గుంభనంగా ఉంటారు. తర్వాత తనకు గుర్తింపు లేదని తెలిసినా, తనకు అవమానం జరిగిందని భావించినా ఆయన సహించరు. పదవి ఆయనకు ముఖ్యం కాదు. అలాగే తనకు గుర్తింపు ఇవ్వని వారు ఎవరైనా సరే లెక్కచేయని మనస్తత్వం రఘరామ కృష్ణరాజుది.

వైసీపీని ముప్పుతిప్పలు పెట్టి...
2019 ఎన్నికలలో తొలుత రఘరామ కృష్ణరాజు టీడీపీలో చేరారు. ఆ తర్వాత మనసు మార్చుకుని వైసీపీ కండువా కప్పేసుకున్నారు. ఆర్థికంగా, సామాజికంగా బలవంతుడు కావడంతో రఘరామ కృష్ణరాజుకు నాటి ఎన్నికల్లో వైఎస్ జగన్ నరసాపురం ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. అయితే ఏడాదికే జగన్ కు, రఘరామ కృష్ణరాజుకు మధ్య పొరపొచ్చాలు బయలుదేరాయి. ఇక రాజు గారు దెబ్బకు జగన్ రోజూ ఇబ్బంది పడాల్సి వచ్చింది. రచ్చ బండ అనే పేరుతో రోజుూ రఘరామ కృష్ణరాజు ఢిల్లీలో కూర్చుని రచ్చ రచ్చ చేసేవారు. పార్టీలోనే ఉంటూ ఆయన పార్టీ అధినేతపైనే నిప్పులు చెరగడం రాజుగారి స్పెషాలిటీ. గత నాలుగేళ్ల పాటు నరసాపురానికి కూడా ఆయన రాలేకపోయారు.
ఎంపీ అవ్వాలనుకున్నా...
అయితే 2024 ఎన్నికల నాటికి ఆయన పార్టీ మారారు. వైసీపీకి రాజీనామా చేశారు. ఆయనకు పార్లమెంటు పదవిపైనే మక్కువ ఎక్కువ. రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి తక్కువ. బీజేపీ తరుపున నరసాపురం టిక్కెట్ ను తీవ్రంగానే ప్రయత్నించినా శ్రీనివావర్మకు దక్కడంతో ఆయన తనపై కుట్ర జరిగిందని నేరుగా ఆరోపించడానికి ఏమాత్రం సంకోచించలేదు. జగన్ వల్లనే తనకు బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదని రఘరామ కృష్ణరాజు బహిరంగంగా ఆరోపించి ఒకరకంగా బీజేపీని కూడా ఇరుకున పెట్టారు. దీంతో చంద్రబాబు నాయుడు ఉండి శాసనసభ టిక్కెట్ ను కేటాయించారు. ఉండి నుంచి రఘరామ కృష్ణరాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఇగో ను తృప్తి పర్చడానికి...
ఉత్త ఎమ్మెల్యే అయితే మజా ఏముంది? మంత్రి పదవి రాజుల కోటాలో దక్కుతుందని రఘరామ కృష్ణరాజు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆశలు వమ్మయ్యాయి. దీంతో రఘురామ కృష్ణరాజు కొంత అసంతృప్తికి గురయ్యారని భావించిన ప్రభుత్వం ఇటీవల ఆయనను డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంపిక చేసింది. అంతే కాదు దీంతో పాటు ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రఘురామ కృష్ణరాజు చాలా వరకూ చల్లబడినట్లే కనిపిస్తుంది. తాను అనుకున్నది సాధించడంలో రఘురామ కృష్ణరాజు తర్వాతే ఎవరైనా? ఒక పని అనుకున్నారంటే దానిని సాధించేంత వరకూ నిద్రపోరన్న ఆయన సన్నిహితుల మాటను నిజం చేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News