Raghu Rama Krishna Raju : ఉండి రాజుగారికి అసలు ఆ యోగం ఉందా? లేదా?

రఘురామ కృష్ణరాజు అంటే ఫైర్ బ్రాండ్ లీడర్. ఇంటా బయటా ఆయన ఎప్పుడు ఏం మాట్లాడినా అది వైరల్ అవుతూనే ఉంటుంది

Update: 2024-06-14 07:05 GMT

రఘురామ కృష్ణరాజు అంటే ఫైర్ బ్రాండ్ లీడర్. ఇంటా బయటా ఆయన ఎప్పుడు ఏం మాట్లాడినా అది వైరల్ అవుతూనే ఉంటుంది. ఆయన పారిశ్రామికవేత్తగా ఫుల్లు సక్సెస్ అయ్యారు. అదే సమయంలో రాజకీయంగా కూడా అదే సక్సెస్ రేటును కొనసాగిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నరసాపురం పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. వైసీపీ నుంచి పోటీ చేసిన రఘురామ కృష్ణరాజు 2019 ఎన్నికల్ల గెలిచిన తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. పార్టీ అధినేతపైనే కాలు దువ్వారు. కనుమూరి రఘురామ కృష్ణరాజు అంటే ఎఫెక్షన్ గా ఎంత ఉంటారో.. విభేదిస్తే కయ్యానికి కూడా అంతే స్థాయిలో కాలు దువ్వుతున్నారని ఆయనను దగ్గర నుంచి చూసిన వారికి ఎవరికైనా తెలుస్తుంది.

వైసీపీలో ఉంటూనే...
2019 ఎన్నికల్లో వైసీపీలో గెలిచినా చివరి వరకూ ఆయన పార్టీలో అసంతృప్త పార్లమెంటు సభ్యుడిగానే కొనసాగారు. దాదాపు మూడేళ్ల పాటు నియోజకవర్గానికి రాలేకపోయినా ఆయన ఢిల్లీ నుంచి రచ్చ బండ పేరుతో జగన్ ప్రభుత్వంపై రోజూ విరుచుకుపడేవారు. తనపైన ఎన్ని కేసులు పెట్టినా పెద్దగా చలించకుండా ఆయన నేరుగా వైసీపీలో ఉంటూ నాడు టీడీపీకి మద్దతు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చారు. తమ పార్టీ అంటూనే ఆ పార్టీపైనే విమర్శలు చేస్తూ వైసీపీ నేతలకు చెమటలు పట్టించారు. ఇటు ఆయన చేసే విమర్శలకు ప్రతి విమర్శలు చేయలేక, ఎలాంటి చర్యలు తీసుకోలేక వైసీపీ నాయకత్వం దాదాపు మూడున్నరేళ్ల పాటు ఉగ్గబట్టి చూస్తుండటం తప్ప ఏమీ చేయలేకపోయింది. అయితే ఆయన ఎన్నికలకు ముందు రఘురామ కృష్ణరాజు బీజేపీలో చేరి నరసాపురం పార్లమెంటు నుంచి పోటీ చేయాలని భావించారు.
స్పీకర్ పోస్టు ఇస్తారంటూ....
కానీ బీజేపీ మాత్రం నరసాపురం స్థానాన్ని తీసుకోవడంతో పాటు దానికి శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ప్రకటించడంతో రఘురామ కృష్ణరాజు రాజకీయంగా కొంత ఇబ్బంది పడ్డారు. ఆయన ఎంపీ అవ్వాలనుకుంటే.. చివరకు చంద్రబాబు నాయుడు ఉండి శాసనసభ నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చారు. అక్కడ నుంచి రఘురామ కృష్ణరాజు విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ రఘురామ కృష్ణరాజుకు మంత్రి అవ్వాలని కోరిక మాత్రం తీరలేదు. అయితే తొలి నుంచి ఆయన స్పీకర్ పదవిలో కూర్చున్నారంటూ సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. స్పీకర్ గా ఎన్నికై తన రాజకీయ ప్రత్యర్థి జగన్ ను కట్టడి చేసే పెత్తనాన్ని రాజుగారికే అప్పగిస్తారంటూ పెద్దయెత్తున ప్రచారం ఇప్పటికీ సాగుతుంది. జగన్ ను స్పీకర్ స్థానంలో ఉండి కట్టడి చేయాలంటే రఘురామ కృష్ణరాజు కరెక్ట్ అంటూ ఆయన అభిమానులు కూడా పెద్దయెత్తున పోస్టింగ్ లు పెడుతున్నారు.
క్షత్రియ సామాజికవర్గానికి...
ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో క్షత్రియ సామాజికవర్గానికి మంత్రి పదవి దక్కలేదు. విజయనగరం నుంచి ఆదితి గజపతిరాజు, బొబ్బిలి నుంచి బేబినాయన గెలిచినప్పటికీ వారెవ్వరికీ స్థానం దక్కలేదు. ఇటు రఘురామ కృష్ణరాజుకు కూడా దక్కకపోవడంతో పాటు స్పీకర్ పదవి ఈయనకు ఇస్తారన్న ప్రచారం ఇప్పటికీ లైవ్ లోనే ఉంది. దీనికితోడు అత్యధిక స్థానాలను గెలిచిన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడు ఒక్కరికే మంత్రి పదవి దక్కింది. పదిహేను శాసనసభ నియోజకవర్గాలున్న ఈ జిల్లాకు స్పీకర్ పదవి ఇస్తే అది ఖచ్చితంగా రఘురామ కృష్ణరాజుకే అని మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇదే స్పీకర్ పోస్టుకు సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు కూడా బలంగా వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.






Tags:    

Similar News