తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
రానున్న 3 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ
రానున్న 3 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. సెప్టెంబర్ 3 నాటికి ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తన ద్రోణి ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి 8 వరకు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు అంచనా వేశారు. ఈ మూడు రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని పలుచోట్ల ఉదయం ఎండలు ఉన్నప్పటికీ సాయంత్రం పూట ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బంగాళాఖాతంలో రుతుపవనాల ద్రోణి ఉత్తర దిశగా విస్తరించింది. దీంతో రుతుపవనాలు మరింత చురుగ్గా మారితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. మిగిలిన జిల్లాలో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందంటున్నారు.