తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటూ వర్షాలే!

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం నాటికి అల్పపీడనంగా మారనుందని

Update: 2023-08-18 02:09 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం నాటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మొత్తం మేఘావృతం అయి ఉంది. నేడు హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దాంతో జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది అలర్ట్ అయ్యారు. మరోవైపు నిర్మల్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, ములుగు, సిరిసిల్ల, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.

ఉత్తర కోస్తా, యానాంలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు. గుంటూరు, బాపట్ల, విజయనగరం, శ్రీకాకుళం, పల్నాడు, తూర్పు గోదావరి, కృష్ణా, కాకినాడ జిల్లాల్లో గురువారం తేలికపాటి వర్షాలు కురిశాయి.


Tags:    

Similar News