ఏపీకి మూడ్రోజులు వర్షసూచన.. నాలుగు జిల్లాలకు పిడుగు హెచ్చరికలు !

ఉపరితల ఆవర్తనాల ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ లలో నేటి నుంచి మూడ్రోజులు..

Update: 2022-05-04 10:48 GMT

తూర్పు విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ మీదుగా అంతర్గత తమిళనాడు వరకు ద్రోణి ఒకటి సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో వరకు వ్యాపించి ఉంది. అలాగే దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో మే 6న అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ పీడనం వాయువ్యదిశగా కదిలి క్రమంగా 48 గంటల్లో వాయుగుండంగా బలపడవచ్చని అమరావతి వాతావరణకేంద్రం వెల్లడించింది.

ఉపరితల ఆవర్తనాల ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ లలో నేటి నుంచి మూడ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
ఇదిలా ఉండగా.. ఏపీలోని నాలుగు జిల్లాలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ పిడుగు హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాలకు పిడుగు హెచ్చరికలు జారీ అయ్యాయి. వాటితో పాటు పల్నాడు జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. జిల్లాలోని మాచర్ల, రెంటచింతల, గురజాల, దాచేపల్లి, వెల్దుర్తి, దుర్గ, కారెంపూడి, పిడుగురాళ్ల, బొల్లాపల్లి మండలాలతో పాటు పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. వై.రామవరం, మారేడుమిల్లి, రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, దేవీపట్నంతో పాటు గోకవరం, కోరుకొండ, జగ్గంపేట, ఏలేశ్వరం, వీరబల్లి, రామాపురం, రాయచోటి, చిన్నమండెం, లక్కిరెడ్డి పల్లె ప్రాంతాల్లో పిడుగులు పడవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.







Tags:    

Similar News